నడి రోడ్లో వాహనాల పార్కింగ్..

  • ఎస్ఆర్ నగర్ లో విన్నూత, వింత అక్రమ పార్కింగ్ లు

అమీర్‌పేట్‌ (ఆంధ్రప్రభ): అధికారుల నిర్లక్ష్యమో, అక్రమార్కుల బరితెగింపో కానీ హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా రోజు రోజుకి ఫుట్‌పాత్‌లు, రహదారులు అన్యాక్రాంతమైపోతున్నాయి.

వ్యాపార వసతులు లేని రెసిడెన్షియల్ నివాస సముదాయాలలో కమర్షియల్ వ్యాపారాలు నిర్వహిస్తున్న అక్రమ వ్యాపారులు, తమ వ్యాపార నిర్వహణ కోసం ఓ వైపు ఫుట్‌పాత్‌లపై శాశ్వత నిర్మాణాలు చేపడుతూ మరో వైపు అక్రమ పార్కింగ్‌లతో రహదారుల కబ్జాలకు పాల్పడి నగర ప్రజలను తీవ్ర ట్రాఫిక్ సమస్యల వలయంలోకి నెడుతూ అధికారులకు సవాల్ విసురుతున్నారు.

హైదరాబాద్ మహానగరంలో అక్రమార్కుల వ్యాపార నిర్వాహణతో ఫుట్‌పాత్‌లు, రహదారులు రోజు రోజుకి కుదించుకుపోతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తుండడం హైదరాబాద్ మహానగర ప్రజల పట్ల శాపంగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు.

ఎస్ఆర్ నగర్ లో విన్నూత , వింత అక్రమ పార్కింగ్ :

ఇలాంటి వినూత్న, వింత అక్రమ పార్కింగ్ ఘటన ఒకటి శనివారం సాయంత్రం ఎస్ఆర్ నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ నుండి బీకే గూడా వార్డ్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఎలాంటి పార్కింగ్ వసతి లేకుండా ఓ హోల్‌సేల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సదరు వ్యాపార నిర్వాహకులు తమ దుకాణానికి లోడ్ దించేందుకు వచ్చిన వాహనం కోసం అక్కడే ఉన్న పలు ద్విచక్ర వాహనాలను తీసి ప్రధాన రహదారి మధ్యలో పెట్టారు.

దీంతో అటుగా ఇరువైపులా వెళ్లే వాహనాలకు దారి మూసుకుపోయి వాహనాలు ఎక్కడిక్కడ రోడ్లపై నిలిచిపోయాయి. సదరు వ్యాపార నిర్వాహకుడి నిర్వాకంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

సదరు వ్యాపారిపై అధికారులు చర్యలు చేపట్టేనా?

ఎస్ఆర్ నగర్ పరిధిలో రహదారి మధ్యలో అక్రమ పార్కింగ్ పాల్పడి తీవ్ర ట్రాఫిక్ సమస్యకు కారకులై వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు చేపడుతూ ప్రజల పక్షాన నిలబడతారా? లేక ఎప్పటిలాగే నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ అక్రమార్కులకు పరోక్షంగా సహకరిస్తారా? అనేది వేచి చూడాల్సిందే..

Leave a Reply