పార్కుల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూల్ బ్యూరో ,ఆంధ్రప్రభ : కర్నూలు నగరంలోని పార్క్‌ల్లో చేస్తున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. శనివారం స్థానిక డాక్టర్స్ కాలనీ లోని సంస్కృతి పార్క్, కిషన్ నగర్ పార్క్, మాధవ్ నగర్‌లోని సైన్స్ పార్క్‌ల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పార్కులను పరిశీలిస్తూ, అన్ని పార్క్‌ల్లో బెంచ్‌లు, లైటింగ్, వ్యాయామానికి సంబంధించిన పరికరాలు, పిల్లల ఆటలకు సంబంధించిన పరికరాలు తదితర మౌలిక వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. నగర ప్రజలకు ఆహ్లాదకర, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. పచ్చదనం పెరిగేలా మొక్కలను పెద్ద ఎత్తున నాటాలన్నారు..ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, మహిళలు పార్కులను సద్వినియోగం చేసుకునేలా అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, కల్లూరు తహసిల్దార్ ఆంజనేయులు పాల్గొన్నారు.
