తల్లిదండ్రులకు (parents) తమ పిల్లలపై అంతులేని ప్రేమ ఉంటుంది. వాళ్లే తమ ప్రాణం, తమ జీవితం అనుకుంటారు. పిల్లల విషయంలో ప్రేమతో పాటు తల్లిదండ్రులకు ఒక అపురూపమైన గర్వం సైతం ఉంటుంది. పుట్టిన బిడ్డను చేతుల్లోకి తీసుకోగానే నా రక్తం, నా వంశం, నా అంశ అనే ఆనందం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పెళ్లయ్యాక చాలాకాలం పాటు సంతానం (fertility) కోసం ఎదురుచూసినవారిలో, పిల్లలు లేకపోవటం వలన అవమానాలు ఎదుర్కొన్నవారిలో బిడ్డ కలగగానే కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. మరి అంతటి అపురూపమైన బిడ్డ నిజంగా తమ సొంతబిడ్డేనా అనే అనుమానం కలిగితే… దానిని భరించడం ఎంతటి నరకం. కృత్రిమ గర్భధారణ విధానాలు పెద్ద ఎత్తున వ్యాపారంగా మారడానికి ప్రధాన కారణమే పిల్లలు లేని తల్లిదండ్రుల తపన… తమ సొంతబిడ్డ కావాలనే తీవ్రమైన కోరిక.

కానీ ఈ విధానాల్లో (procedures) జరుగుతున్న అక్రమాలు, అవినీతి ఆ కోరికకే తూట్లు పొడుస్తున్నాయి. కృత్రిమ గర్భధారణ ద్వారా బిడ్డని పొందిన తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పుట్టించేలా ఉన్నాయి ఆ అక్రమాలు. సంతానం (children) కోసం వచ్చిన దంపతుల నుండి కాకుండా అక్రమంగా సేకరించిన పునరుత్పత్తి కణాల ద్వారా సరోగసి ప్రక్రియ నిర్వహించడం, అసలు సరోగసీ అనేదే లేకుండా ఎక్కడో పుట్టిన పిల్లలను కొని తెచ్చి తమదైన సంతానం ఆశిస్తున్న తల్లిదండ్రులకు ఇవ్వటం లాంటి అక్రమాలు నివ్వెరపోయేలా చేస్తున్నాయి. జీవితం (life)లో ఇంత ప్రధానమైన, కీలకమైన విషయంలో తగిన జాగ్రత్తలు (precautions) తీసుకోవాల్సిన అవసరం ఉందని సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకుల అరాచకాలు మరోసారి రుజువు చేశాయి.

దంపతుల్లో స్త్రీనుండి అండాలను, మగవారినుండి స్పెర్మ్ ని తీసి కృత్రిమ గర్భధారణ (artificial insemination) ప్రాసెస్ నిర్వహిస్తారు. అయితే ఈ ప్రక్రియ మొత్తం అత్యాధునికమైన వైద్యవిధానాలతో పాటు నీతి నిజాయితీ నమ్మకాలతో కూడా ముడిపడి ఉంది. తమ చేతుల్లోకి రానున్న బిడ్డ నిజంగా తమ బిడ్డేనా అనే అనుమానం రాకుండా ఉండాలంటే కృత్రిమ గర్భధారణ పద్దతులకు వెళ్లాలనుకుంటున్నవారు కొన్ని జాగ్రత్తలు (precautions) తీసుకోవాలి. అది వారి హక్కు (right) కూడా.

అయితే సాధారణంగా కృత్రిమ గర్భధారణకు వెళుతున్న వారంతా తమ ద్వారా జన్మించిన బిడ్డ తమదే అనే నమ్మకంతోనే ఉంటారు. ప్రస్తుతం కృత్రిమ గర్భధారణ చుట్టూ పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతున్న నేపథ్యంలో బిడ్డ తమకు చెందినదేనా అనే విషయాన్ని తప్పనిసరిగా నిర్దారించుకోవాల్సిన అవసరం ఉంది. డిఎన్ఎ పరీక్ష ద్వారా బిడ్డ విషయంలో ఎలాంటి అనుమానాలు లేకుండా తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కృత్రిమ పద్ధతుల్లో బిడ్డను పొందిన జంటలు తప్పనిసరిగా డిఎన్ఎ పరీక్ష (dna test)ను అడుగుతారు… అది తప్పనిసరి అనే భయం ఉన్నపుడు ఈ వైద్య విధానాల్లో అవకతవకలను నివారించే అవకాశం ఉంటుంది.

మనదేశంలో ఐవిఎఫ్ (ivf) ద్వారా తల్లిదండ్రులయిన దంపతులు బిడ్డ తమకు చెందినదేనా అనే విషయాన్ని తెలుసుకునేందుకు డిఎన్ఎ పరీక్షని చేయించుకోవచ్చు. మనదేశంలో అమలులో ఉన్న పీసీపీఎన్ డిటీ చట్టం ప్రకారం గర్భంలో ఉన్న శిశువు ఆడా, మగా అనే విషయాన్ని తెలుసుకోరాదనే నిబంధన ఉంది కానీ… ఐవిఎఫ్ ద్వారా తల్లిదండ్రులయినవారు డిఎన్ ఎ టెస్టు (dna test)కి వెళ్లరాదనే నిబంధన ఏమీ లేదు. ఎంతో శ్రమకు ఖర్చుకు ఓర్చుకుని ఎంతో మానసిక ఒత్తిడి (mental stress)ని భరించి బిడ్డని పొందాలని ఆశించే వారు తప్పకుండా అత్యంత కీలకమైన ఈ విషయంలో అక్రమాలు అవినీతి జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

Leave a Reply