అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లు..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీల ఆర్థిక లావాదేవీల్లో కీలక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ పంచాయతీరాజ్ (నాలుగో సవరణ) బిల్లు–2026ను ప్రభుత్వం బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ఈ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు.

ప్రస్తుతం గ్రామ పంచాయతీలు సమకూర్చుకునే సొంత ఆదాయాన్ని ట్రెజరీలో జమ చేస్తున్నారు. తాజా సవరణ బిల్లు ఆమోదం పొందితే.. ఇకపై పంచాయతీలు తమ సొంత ఆదాయాన్ని సమీపంలోని జాతీయీకృత బ్యాంకుల్లో జమ చేసుకునే అవకాశం కలగనుంది. ఈ మార్పుతో పంచాయతీల నిధుల నిర్వహణ మరింత సులభతరం కావడంతో పాటు.. అవసరమైన సమయంలో నిధులను వేగంగా వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధుల వినియోగం మరింత సమర్థంగా జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బిల్లుపై సభ్యులు చర్చించనున్నారు. చర్చ ముగిసిన తర్వాత ప్రభుత్వం బిల్లుకు సభ ఆమోదం కోరనుంది.
గ్రామ పంచాయతీల సొంత ఆదాయంపై మరింత స్వేచ్ఛ కల్పించడంతో పాటు.. నిధుల నిర్వహణ, వినియోగ ప్రక్రియను వేగవంతం చేయడమే ఈ సవరణ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. బిల్లు ఆమోదం పొందితే పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా మారే అవకాశం ఉంది.
