Panchayat Elections | ఏకగ్రీవం చేస్తే పది లక్షలు..

Panchayat Elections | ఏకగ్రీవం చేస్తే పది లక్షలు..
Panchayat Elections, మంచిర్యాల జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : అవునండీ మీరు చదివింది నిజమే..! గ్రామ సర్పంచ్ గా తాము బలపరిచే, మద్దతు ఇచ్చే అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే.. అక్షరాలా 10 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించారు బీజేపీ (BJP) రాష్ట్ర ఉపాధ్యక్షులు, మంచిర్యాల జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ రావు. ఈ మేరకు అధికారికంగా వీడియో ద్వారా సోషల్ మీడియాలో స్వయంగా ఆయన ప్రకటించడం గమనించదగ్గ విషయం. మంచిర్యాల అసెంబ్లీ నియోజక వర్గంలో ఉన్న 61 గ్రామ పంచాయతీలో ప్రస్తుతం మొదటి విడత జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే ఆ మేరకు ఇస్తానంటూ తన సొంత నజరాన్ని ప్రకటించారు.
అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి పథకాలను ఆయా గ్రామాలకు అమలు చేయడంలోనూ ప్రత్యేక కృషి చేస్తానని కూడా ఆయన వీడియో ద్వారా ప్రకటించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు.. రాజకీయ పార్టీలకు ప్రత్యక్ష సంబంధాలేవి లేనప్పటికీ తమ పార్టీ బలపరిచే అభ్యర్థిని గెలిపిస్తే.. చాలంటూ కూడా ఆయన ఈ ప్రకటన చేయడంతో సోషల్ మీడియాలో ఆ వీడియో చక్కర్లు కొడుతోంది.
