పలాస లో ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రచారం.

పలాస, ఆంధ్రప్రభ : పలాస పట్టణంలో నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆమదాలవలస నియోజకవర్గ శాసనసభ్యుడు, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీషతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. పలాస మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వజ్జ బాబురావు సతీమణి వజ్జ గంగాభవానితో పాటు 20, 23, 24, 25వ వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఓటర్లను కలిశారు.

ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కూన రవికుమార్ కోరారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పలాస పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని, నవంబర్ 1న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.