నిర్వాసితులకు భారీ ఊరట..
నిర్వాసితులకు భారీ ఊరట..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.637 కోట్ల ప్రతిపాదనలు!
ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కృషితో ఆర్‌అండ్‌ఆర్ పనులకు అదనంగా రూ.25 కోట్ల మంజూరు
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలో భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు పరిహారం, పునరావాసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ మేరకు రూ.637.15 కోట్ల నిధుల మంజూరుకు నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

ఈ నిధుల్లో ఆర్‌అండ్‌ఆర్ (రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్) పనులు, గృహ నిర్మాణాలు, నగదు ప్రయోజనాలు, పునరావాస కాలనీల అభివృద్ధి కోసం రూ.587.15 కోట్లు, మిగిలిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు రూ.50 కోట్లు అవసరమని అధికారులు నివేదించారు.
వట్టెం రిజర్వాయర్ పరిధిలోని నిర్వాసిత కుటుంబాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి విజ్ఞప్తికి స్పందించిన ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల కోసం అదనంగా రూ.25 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వట్టెం రిజర్వాయర్ పరిధిలో 466 నిర్వాసిత కుటుంబాలకు ఇప్పటికే రూ.53.20 కోట్ల పరిహారం, రూ.29.93 కోట్ల నిర్మాణ వ్యయంతో మొత్తం రూ.83.13 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ పునరావాస కాలనీల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, గృహ నిర్మాణాలు తదితర మౌలిక వసతుల పనులను పూర్తి చేయడానికి అదనపు నిధులు అవసరమని ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
నిర్వాసిత కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం, గృహ నిర్మాణాలు, రోడ్లు, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి జాప్యం లేకుండా నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టడంతో నిర్వాసిత కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ప్రాజెక్టు కోసం అవసరమైన 27,079.59 ఎకరాల భూమిలో ఇప్పటికే 26,882.95 ఎకరాల భూసేకరణ పూర్తికాగా, కేవలం 196.64 ఎకరాల భూసేకరణ మాత్రమే పెండింగ్‌లో ఉంది. దానిని పూర్తి చేయడానికి రూ.50 కోట్లు అవసరమని అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే వేలాది నిర్వాసిత కుటుంబాలకు ఉపశమనం లభించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పునరావాస పనులు వేగవంతమయ్యే అవకాశం ఉంది. అలాగే భూసేకరణ ప్రక్రియ పూర్తై ప్రాజెక్టు పనులు మరింత వేగం పుంజుకుంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సందర్భంగా నిర్వాసితుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
