యోగతో ఆరోగ్యవంతమైన సమాజం

యోగతో ఆరోగ్యవంతమైన సమాజం

  • మారేడుమిల్లి అరణ్య ప్రాంతంలో యోగాంధ్రకు విశేష స్పందన
  • జూన్ 21న రంపచోడవరంలో భారీగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
  • పోలవరం (రంపచోడవరం) జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్

మారేడుమిల్లి, ఆంధ్రప్రభ : ప్రతి వ్యక్తి ప్రతిరోజూ కనీసం 45 నిమిషాలు యోగా సాధన చేస్తే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండవచ్చని పోలవరం (రంపచోడవరం ) జిల్లా కలెక్టర్ కొత్తమాసు దినేష్ కుమార్ పేర్కొన్నారు. యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా మంగళవారం మారేడుమిల్లి సమీపంలోని వుడ్స్ రిసార్ట్స్ ప్రాంగణంలో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్. బొజ్జిరెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే, లెజిస్లేటివ్ కమిటీ చైర్‌పర్సన్ మిరియాల శిరీష దేవి, జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు గొర్లె సునీత తదితరులతో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ యోగా భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వ సంపద అని, దాని విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పే క్రమంలో 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితిలో తీసుకున్న చొరవతో జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచ దేశాలు జరుపు కుంటున్నాయని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు యోగా ప్రయోజనాలను ప్రతి ఇంటికీ చేరవేసేందుకు 14 రోజులపాటు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఒత్తిడితో కూడిన ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లాలో పర్యాటకాభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని, వాటిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మారేడుమిల్లి వంటి ప్రకృతి అందాల మధ్య నిర్వహిస్తున్నామని కలెక్టర్ వివరించారు. గుడిసె, మారేడుమిల్లి, పరిసర ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రములను యోగాంధ్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

జిల్లాలో ప్రతి పౌరుడికి కామన్ యోగా ప్రోటోకాల్‌పై శిక్షణ అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 17న చింతూరు మండలం మోతుగూడెంలో, జూన్ 21న రంపచోడవరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎస్. బొజ్జిరెడ్డి మాట్లాడుతూ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో యోగాంధ్ర నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. యోగా వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అపారమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి నాయకులు కూడా నిత్య యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కూడా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని పేర్కొన్నారు. యోగా చేయడం వల్ల కుటుంబాలు ఆరోగ్యవంతంగా మారడంతో పాటు సమాజం కూడా ఆరోగ్యకరంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా సాధన చేసి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. పోలవరం జిల్లాలో ప్రతి వ్యక్తికి యోగా పట్ల అవగాహన కల్పించే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అనంతరం యోగా గురువులు కథల నారాయణరెడ్డి, కథల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వివిధ యోగాసనాలను ప్రదర్శించి పాల్గొన్న వారితో సాధన చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. అంబేద్కర్, ఆర్డీవో కె. స్వాతి, ఎస్డీపీఓ అష్రఫ్ అలీ, రాష్ట్ర మైనార్టీ కమిటీ సభ్యుడు షేక్ సుభాని, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply