మోదీని కట్ చేసిన పాక్..
- ఫుల్ ఫొటోతో భారత్ కౌంటర్!
- ఎస్సీఓ సదస్సు గ్రూప్ ఫొటోలో మోదీకి పాక్ పీఎంవో కోత..
- వెంటనే అసలు చిత్రాన్ని పంచుకున్న ప్రధాని
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. తన చీప్ సోషల్ మీడియా ట్రిక్స్‌తో వార్తల్లో నిలిచింది. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొన్న దేశాధినేతల గ్రూప్ ఫొటోను పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీని మాత్రమే కాకుండా మరికొందరు దేశాధినేతలను కూడా ఫొటో నుంచి తొలగించి.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను మధ్యలో కనిపించేలా ఫొటోను కత్తిరించడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో మంగళవారం జరిగిన ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా 10 సభ్య దేశాల అధినేతలు కలిసి గ్రూప్ ఫొటో దిగారు. అసలు ఫొటోలో ప్రధాని మోదీతో పాటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ఇతర దేశాధినేతలు కూడా ఉన్నారు. అయితే పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ఫొటోలో మోదీతో పాటు పలువురు నేతలు కనిపించకుండా కట్ చేశారు. దీంతో షెహబాజ్ షరీఫ్ ఫొటో మధ్యలో ఉన్నట్లు కనిపించింది.

అయితే పాకిస్థాన్ చేసిన ఈ ‘ఫొటో మాయాజాలం’ ఎంతోసేపు దాగలేదు. ప్రధాని మోదీ స్వయంగా పూర్తి గ్రూప్ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో అసలు చిత్రం బయటపడింది. పూర్తి ఫొటోలో షెహబాజ్ షరీఫ్ మధ్యలో కాకుండా కుడివైపు నాలుగో స్థానంలో నిల్చున్నట్లు స్పష్టమైంది. దీంతో షెహబాజ్‌ను ప్రాధాన్య స్థానంలో చూపించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఫొటోను కత్తిరించారనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఇంతటితో పాక్ సోషల్ మీడియా వ్యవహారం ఆగలేదు. షెహబాజ్ షరీఫ్ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలో ఎస్‌సీఓ నేతల సమావేశానికి సంబంధించిన ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. అందులోనూ ప్రధాని మోదీ కనిపించకుండా దృశ్యాలను కత్తిరించారనే ఆరోపణలు వచ్చాయి. అసలు వీడియోను నెటిజన్లు బయటకు తీసుకురావడంతో పాక్ డిజిటల్ బృందం తీరుపై మరింత విమర్శలు వచ్చాయి.

‘ఇదేం చీప్ ట్రిక్?’.. నెటిజన్ల ఫైర్
పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం తీరుపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘ప్రపంచ నేతల గ్రూప్ ఫొటోలో మోదీని కట్ చేసి షెహబాజ్‌ను మధ్యలో పెట్టడం దేనికి సంకేతం?’ అంటూ ప్రశ్నించారు. మరికొందరు పాక్ డిజిటల్ బృందాన్ని తీవ్రంగా ఎద్దేవా చేశారు.
‘మోదీని ఫొటోలో లేకుండా చేయాలనుకున్నారు.. కానీ మోదీనే పూర్తి ఫొటోను పంచుకోవడంతో పాక్ బండారం బయటపడింది’ అంటూ పలువురు పోస్టులు పెట్టారు. మరో జర్నలిస్టు స్పందిస్తూ.. ఎస్‌సీఓ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే పాక్ చేసిన తొలి విదేశాంగ సంబంధిత సోషల్ మీడియా ప్రయత్నం ఇంత పేలవంగా ఉండటం ఆశ్చర్యకరమని విమర్శించారు. షెహబాజ్‌ను మధ్యలో చూపించాలనే ఆతృతలో ఏకంగా ఐదుగురు ప్రపంచ నేతలను ఫొటో నుంచి తొలగించారని ఎద్దేవా చేశారు.

కొంతమంది నెటిజన్లు షెహబాజ్ షరీఫ్ చేతిలో ‘బిక్షాపాత్ర’ ఉన్నట్లుగా ఫొటోలను ఎడిట్ చేసి పోస్టు చేయడం కూడా వైరల్‌గా మారింది. గతంలో ఆర్థిక సాయం కోసం ప్రపంచ దేశాల చుట్టూ తిరగాల్సి వస్తోందని షెహబాజ్ స్వయంగా చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. పాక్ ఆర్థిక పరిస్థితిని ప్రస్తావిస్తూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మోదీ, జిన్‌పింగ్, పుతిన్ భేటీ
ఇక ఎస్‌సీఓ సదస్సులో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఉత్సాహంగా మాట్లాడారు. ముగ్గురు నేతలు పరస్పరం కరచాలనం చేసుకుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు. గత ఏడాది టియాంజిన్‌లో జరిగిన ఎస్‌సీఓ సదస్సులోనూ మోదీ, జిన్‌పింగ్, పుతిన్ కలిసి మాట్లాడిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారాయి.
మరోవైపు గ్రూప్ ఫొటో అనంతరం షెహబాజ్ షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడేందుకు హడావుడిగా వెళ్లిన దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమయ్యాయి. పుతిన్ అక్కడి నుంచి వెళ్తుండగా షెహబాజ్ ఆయన చేయి పట్టుకుని ఆపి మాట్లాడిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
ఉగ్రవాదంపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
ఎస్‌సీఓ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగంలో ఉగ్రవాదమే ప్రధాన అంశంగా నిలిచింది. పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే.. ఉగ్రవాదంపై పోరులో ‘రెండు రకాల ప్రమాణాలు ఉండకూడదు’ అని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి ఆర్థిక సహకారం అందించే వ్యవస్థతో పాటు దాని మొత్తం మౌలిక వ్యవస్థను నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఉగ్రవాదాన్ని తమ విధానానికి సాధనంగా ఉపయోగించే దేశాలకు, ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వారికి గట్టి సందేశం ఇవ్వాలని మోదీ అన్నారు. ఉగ్రవాదం ఎవరికీ వ్యూహాత్మక ఆస్తిగా మారకూడదని స్పష్టం చేశారు.
గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో భారత్-పాకిస్థాన్ సంబంధాలు మరింత దిగజారాయి. సరిహద్దు ఉగ్రవాదంపై పాకిస్థాన్ చర్యలు తీసుకునే వరకు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.
