CT 2025 | ఐసిసిపై పాక్ బోర్డు గ‌రం గ‌రం

  • బ‌హుమ‌తి ప్ర‌ధానోత్స‌వంలో ప్రాతినిధ్యం లేక‌పోవ‌డంపై అసంతృప్తి
  • అతిథ్య దేశాన్ని అవ‌మానించారంటూ పాక్ క్రికెట‌ర్స్ మండిపాటు
  • ఐసిసి వివ‌ర‌ణ ఇచ్చినా చ‌ల్లార‌ని ర‌చ్చ

దుబాయ్ : క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూసిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 ముగిసింది. దుబాయ్ వేదిక‌గా జరిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి భార‌త జ‌ట్టు ముచ్చ‌ట‌గా మూడోసారి కప్పును ముద్దాడింది. ఈ క్ర‌మంలో ఛాంపియ‌న్స్ ట్రోఫీని అత్య‌ధిక సార్లు గెలిచిన జ‌ట్టుగా రికార్డుల‌కు ఎక్కింది.

కాగా.. ఫైన‌ల్ మ్యాచ్ అనంత‌రం జ‌రిగిన ప్రెజెంటేషన్ సెర్మ‌నీ వేదిక‌పై ఆతిథ్య పాకిస్థాన్ నుంచి ఒక్క‌రు కూడా పాల్గొన‌లేదు. దీనిపై ఇప్ప‌టికే పాక్ మాజీ ఆట‌గాళ్లు షోయ‌బ్ అక్త‌ర్‌, వ‌సీం అక్ర‌మ్ స‌హా ప‌లువురు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

పీసీబీ ఛైర్మ‌న్ మొహ్సిన్ నఖ్వీ అనారోగ్యంతో వెళ్ల‌లేద‌ని అంటున్నారు. అయితే.. పీసీబీ సీఈఓ సుమైర్ అహ్మద్, ఉస్మాన్ వాహ్లా ఇదరు దుబాయ్‌లోనే ఉన్నారు. మ‌రి వారిద్ద‌రిలో క‌నీసం ఒక్క‌రైనా వేదిక పై ఉండాల్సింది అని మండిప‌డ్డారు.

కావాల‌నే పాక్ అధికారులు లేకుండా ఐసీసీ సెర్మ‌నీ నిర్వ‌హించిందా లేదా పాక్ అధికారులే హాజ‌రు కాలేదా అంటూ ప్ర‌శ్నల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ముగింపు వేడుక‌ల కార్య‌క్ర‌మంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ భారత ఆటగాళ్లకు వైట్‌ జాకెట్స్‌, మ్యాచ్ అధికారులకు పతకాలను బహుకరించగా.. ఐసీసీ చైర్మన్ జే షా కెప్టెన్ రోహిత్ శర్మకు ట్రోఫీని అంద‌జేశాడు. వీరితో పాటు వేదికపై కార్యదర్శి దేవజిత్ సైకియా, న్యూజిలాండ్ క్రికెట్ సీఈఓ రోజర్ ట్వోస్ కూడా ఉన్నారు.

నిర‌స‌న తెలిపిన పీసీబీ..

ముగింపు వేడుక‌ల కార్య‌క్ర‌మంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సీఈవో, ఛాంపియ‌న్స్ ట్రోఫీ టోర్న‌మెంట్ డైరెక్ట‌ర్ సుమైర్ అహ్మ‌ద్‌ను విస్మ‌రించ‌డం పై ఐసీసీకి పీసీబీ త‌న నిర‌స‌న‌ను తెలియ‌జేసింది. అయితే ఇందుకు గ‌ల కార‌ణాన్ని ఐసీసీ తెలిపిన‌ప్ప‌టికి పీసీబీ ఛైర్మ‌న్ మొహ్సిన్ నఖ్వీ సంతృప్తి చెంద‌లేద‌ని పీసీబీ వ‌ర్గాలు తెలిపాయి.

వాస్త‌వానికి పీసీబీ ఛైర్మ‌న్ మొహ్సిన్ నఖ్వీ ముగింపు వేడుక‌ల కార్య‌క్ర‌మంలో వేదిక పై ఉంచేందుకు తొలుత ఐసీసీ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసింది. అయితే.. ఆయ‌న హాజ‌రు కాక‌పోవ‌డంతో త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను మార్చుకున్న‌ట్లుగా ఐసీసీ చెప్పిన‌ట్లుగా పీసీబీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

త‌ప్పులు త‌డ‌క‌గా…

ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 సంద‌ర్భంగా పాక్ విష‌యంలో ఐసీసీ అనేక త‌ప్పుల‌ను చేసిన‌ట్లుగా గుర్తించిన‌ట్లు చెప్పింది. భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సార స‌మ‌యంలో ఛాంపియ‌న్స్ ట్రోఫీ2025 లోగో మార్చ‌డం, లాహోర్‌లో ఆస్ట్రేలియా వ‌ర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్‌లో భార‌త జాతీయ గీతాన్ని ప్లేచేయ‌డం కూడా ఉంది. ప్లేజాబితాలో లోపం కార‌ణంగా భార‌త జాతీయ గీతాన్ని కొన్ని సెక‌న్ల పాటు ప్లే చేశార‌ని, ఆ త‌రువాత ఆ లోపాన్ని స‌రిద్దిద్దార‌ని ఐసీసీ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *