ఖర్గేతో పద్మశ్రీ సుంకర, శ్రీరాములు భేటీ

  • ఏపీ తాజా రాజకీయ పరిస్థితులు..
  • స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ బ్యూరో: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఏపీ పీసీసీ మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పద్మశ్రీ సుంకర, ఏఐసీసీ సభ్యుడు శ్రీరాములు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అంశాలపై ఖర్గేతో చర్చించినట్లు తెలిసింది.

ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు ఖర్గేతో చర్చించినట్లు సమాచారం. గ్రామస్థాయి నుంచి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, బలమైన నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడం వంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకుని పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ శ్రేణులను సమన్వయంతో ముందుకు నడిపించడంపైనా భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఖర్గే ఆరా తీసినట్లు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై నేతల నుంచి వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు.. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా పోరాడేందుకు అవసరమైన కార్యాచరణపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ బలోపేతానికి వేదికగా మలుచుకునే అంశంపై నేతలు దృష్టి సారించినట్లు సమాచారం.