Padma Awards | పవన్ కళ్యాణ్ అభినందనలు..

Padma Awards | పవన్ కళ్యాణ్ అభినందనలు..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సామాజిక, శాస్త్ర సాంకేతిక, విద్య, వైద్య, వ్యవసాయ, కళ, సాహిత్య.. ఇలా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పద్మ పురస్కారాల ఎంపికలో గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా అనుసరిస్తున్న ప్రమాణాలు ప్రతి ఒక్కరికీ ఆమోదయోగ్యంగా ఉంటున్నాయి.

ప్రపంచ ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడుని పద్మభూషణ్ ఎంపిక చేయడం ముదావహం. క్యాన్సర్ వ్యాధి పై సామాన్యుల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. ప్రముఖ నటులు, విభిన్న పాత్రలలో ఒదిగిపోయే మమ్ముట్టిని పద్మభూషణ్ కి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డులకు ఎంపికైనవారికి హృదయపూర్వక అభినందనలు అని పవన్ కళ్యాణ్ తెలియచేశారు.

తెలుగు రాష్ట్రాల నుంచి కళ, శాస్త్ర, వైద్య, సాహిత్య రంగాల్లో కృషి చేసిన వారిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేశారు. ప్రముఖ నటులు, మాజీ ఎంపీ మురళీ మోహన్ , ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్ పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావడం ఆనందాన్ని కలిగించిందని పవన్ కళ్యాణ్ తెలియచేశారు. తెలుగు సినిమాల్లో వారికంటూ ప్రత్యేక స్థానం ఉంది. కూచిపూడి నృత్య కళాకారిణి శ్రీమతి దీపిక రెడ్డి, బహు భాషా నటుడు ఆర్ మాధవన్, క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, వైద్య నిపుణులు డా.గూడూరు వెంకట రావు, డా.పి విజయానంద రెడ్డి, శాస్త్రవేత్త శ్రీ గడ్డమణుగు చంద్రమౌళి, సంస్కృత, అద్వైత- వేదాంత పండితులు, కవి శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి, విద్యావేత్త, యూజీసీ మాజీ ఛైర్మన్ డాక్టర్ మామిడాల జగదీష్ కుమార్ పద్మశ్రీ పురస్కారాలకి ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. వారివారి రంగాల్లో విశిష్టమైన సేవలు అందించారు. పద్మ అవార్డులకి ఎంపికైన వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.

మరణాంతరం పద్మవిభూషణ్ పురస్కారానికి ప్రముఖ నటులు ధర్మేంద్ర, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి ఎస్ అచ్యుతనందన్, పద్మభూషణ్ అవార్డుకు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్, పద్మశ్రీ పురస్కారానికి పాడి పరిశ్రమ రంగంలో కృషి చేసిన ఉత్తమ పాడి రైతు మామిడి రమణారెడ్డి, అన్నమాచార్య కీర్తనలు నేటి జన బాహుళ్యానికి చేరువ చేసేందుకు తన వంతు కృషి చేసిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు ప్రకటించి వారి సేవలను స్మరించుకునేలా చేశారని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలియచేశారు.
