వరి కొయ్యలకు నిప్పు.. ఫీల్డ్‌లోకి దూసుకెళ్లిన అధికారులు

  • చందనపల్లిలో మంటలను అదుపు చేసిన తహశీల్దార్‌, ఏఓ
  • పంట అవశేషాలు కాల్చితే చట్టపరమైన చర్యలు, జరిమానాలు తప్పవని హెచ్చరిక..

నల్లగొండ రూరల్‌, ఆంధ్రప్రభ :

నల్లగొండ మండలం చందనపల్లి గ్రామ శివారులో వరి కొయ్యలను తగలబెడుతుండగా అధికారులు అప్రమత్తమయ్యారు. బుధవారం మధ్యాహ్నం పొలాల్లో మంటలు చెలరేగినట్లు సమాచారం అందడంతో తహశీల్దార్‌ పరశురాం, మండల వ్యవసాయ అధికారి (ఏఓ) సుంకోజు శ్రీనివాస్‌ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వరి కొయ్యలకు నిప్పు పెడుతున్నట్లు గుర్తించి వెంటనే మంటలను అదుపు చేశారు.

అనంతరం అక్కడున్న రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలను వివరించి, ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు భూమి సారాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని సూచించారు.

ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు తెలిపారు. ఇలాంటి సమయంలో వరి కొయ్యలను కాల్చడం వల్ల మరింత నష్టం జరుగుతుందన్నారు. పంట అవశేషాల దహనంతో విపరీతమైన వాయు కాలుష్యం ఏర్పడుతుందని, వెలువడే పొగ పిల్లలు, వృద్ధుల్లో శ్వాస సంబంధిత సమస్యలకు కారణమవుతుందని వివరించారు.

మంటల వేడికి భూమిలోని మిత్ర పురుగులు, వానపాములు, సూక్ష్మజీవులు చనిపోతాయని, దీంతో భూసారం దెబ్బతింటుందని పేర్కొన్నారు. పొలంలో ఉండే సేంద్రియ పదార్థం బూడిదగా మారిపోవడంతో దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందన్నారు. తద్వారా రైతులు మళ్లీ ఎరువుల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపారు. అంతేకాకుండా పక్క పొలాల్లోని పంటలకు, విద్యుత్‌ స్తంభాలు, తీగలకు మంటలు వ్యాపించి నష్టం కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

పంట అవశేషాలను కాల్చకుండా రోటవేటర్‌తో భూమిలో కలియదున్నాలని ఏఓ శ్రీనివాస్‌ సూచించారు. ఇలా చేయడం వల్ల అవశేషాలు భూమిలోనే ఎరువుగా మారుతాయని తెలిపారు. లేదంటే వాటితో కంపోస్టు ఎరువు తయారు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న యంత్రాలను వినియోగించుకుని పంట అవశేషాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.

వరి కొయ్యలు, ఇతర పంట అవశేషాలను తగలబెట్టవద్దని తహశీల్దార్‌ పరశురాం స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి పంట అవశేషాలను కాల్చిన వారిపై పర్యావరణ చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.