స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

కార్యకర్తలు సమష్టిగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలి: మంత్రి పయ్యావుల కేశవ్

ఉరవకొండ, ఆంధ్రప్రభ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పిలుపునిచ్చారు. మండలంలోని పెద్ద కౌకుంట్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. సమావేశానికి జోనల్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాసులురెడ్డి, జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, నియోజకవర్గ పరిశీలకుడు మల్లెల రాజశేఖర్‌, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి తదితరులు హాజరయ్యారు.

మంత్రి పయ్యావుల కేశవ్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు ఎలాంటి అవాస్తవాలను నమ్మకుండా ప్రజల్లో ఉంటూ పార్టీని బలోపేతం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మించామని, హంద్రీనీవా కాలువ వెడల్పు పనులతో రాయలసీమలో ఎంతో మంది రైతులకు ప్రయోజనం కలిగిందని తెలిపారు. ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. సమావేశానికి కూడేరు, బెలుగుప్ప, విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.