అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
ముసలివాడినయ్యా ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో..
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ముసలివాడినయ్యా.. రానున్నఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు.. పోటీ చేయకపోవచ్చు కూడా.. అని మజ్లిస్ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. పాతబస్తీ బండ్లగూడలోని బారిస్టర్ ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ ఒవైసీ కళాశాలల్లో ఇంటర్ పాసైన విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
12వ తరగతి వరకే చదివానని చెప్పడానికి నేను సిగ్గుపడటం లేదు.. అయినా కీర్తి ప్రతిష్ఠలు పొందడమే కాకుండా.. ఆకాశాన్నంటే ఒవైసీ విద్యాసంస్థల భవనాలను నిర్మించా. కొందరు నా పరువుతో ఆటలాడుకుంటున్నారు. ఇబ్బందులు సృష్టించడానికి కుయుక్తులు పన్నుతున్నారు. కానీ ఎవరిముందూ నేను తలవంచే ప్రసక్తే లేదు. ఈ దేశం అందరిదీ.. సమాన హక్కులు ఉన్నాయి. నేను ఉన్నా లేకపోయినా ఒవైసీ విద్యాసంస్థల భవనాల్లో నా గళం శాశ్వతంగా నిలిచిపోతుంది. అన్నీ వదిలేసి మక్కాలోనే ఉండాలని ఉంది. అక్కడే కన్ను మూయాలనేదే నా చివరి కోరిక అని భావోద్వేగంతో ప్రసంగించారు.
