డిమాండ్లు పరిష్కరించాలి.. రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఉస్మానియా విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, వర్సిటీ అధికారులు వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో వర్సిటీ పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందువల్లే సిబ్బంది ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని విమర్శించారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తోందని తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ భవనం ఎదుట ఓపీఎస్ అమలు, సర్వీసుల క్రమబద్ధీకరణ, ఆరోగ్య ప్రయోజనాలు తదితర డిమాండ్లతో నిరసన తెలుపుతున్న నాన్ టీచింగ్, టెక్నికల్, టైమ్ స్కేల్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని బుధవారం రాంచందర్ రావు సందర్శించారు. ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయంతో తనకు, తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. తాను ఇదే విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశానని, తన తండ్రి కూడా ఇక్కడ ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారని గుర్తుచేసుకున్నారు.
దేశానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, మేధావులు, రాజకీయ నాయకులను అందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత, పెన్షన్ సౌకర్యాలు లేకపోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలోనూ టైమ్ స్కేల్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదని విమర్శించారు. 25 నుంచి 30 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలని కోరారు.
2001 నుంచి 2004 మధ్య నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలని, 2004 తర్వాత నియమితులైన వారికి సీపీఎస్ అమలు చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఎల్ఐసీ లింక్డ్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను రూ.10 వేల నుంచి రూ.30 వేలకు పెంచాలని, పెండింగ్‌లో ఉన్న అంతర్గత పదోన్నతులు, నియామక ప్రక్రియలను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.వర్సిటీ ఖాతాల జప్తు పేరుతో ఉద్యోగులకు ఏటా రావాల్సిన రూ.1,500 ఇంక్రిమెంట్‌ను నిలిపివేయడం, పీఎఫ్‌కు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలపై ఆంక్షలు విధించడం సరికాదని ఆయన ఆరోపించారు.
ఉద్యోగులు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడటం, నిరసన తెలిపిన వారిపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం సరికాదని రాంచందర్ రావు అన్నారు. గతంలో అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రొఫెసర్ మనోహర్‌పై తీసుకున్న సస్పెన్షన్ చర్యలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు.విశ్వవిద్యాలయ పాలనలో వైస్ ఛాన్సలర్ కీలక బాధ్యతలు నిర్వహిస్తారని, ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమానికి మద్దతు
ఓయూ పూర్వ విద్యార్థిగా, లా కాలేజీ మాజీ అలూమ్ని ప్రెసిడెంట్‌గా విశ్వవిద్యాలయ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని రాంచందర్ రావు తెలిపారు. ప్రభుత్వం, వర్సిటీ ఉన్నతాధికారులు మొండివైఖరి వీడి బోధనేతర ఉద్యోగుల జేఏసీ నాయకులను వెంటనే చర్చలకు ఆహ్వానించాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే వారి పోరాటానికి బీజేపీ ప్రత్యక్షంగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, మాజీ ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ విశ్వవిద్యాలయాల నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, ఓయూ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
