Oregon-School-Shooting : సాహో,,టీచ‌ర‌మ్మా…! Andhra Prabha Crime Story

Oregon-School-Shooting : సాహో…టీచ‌ర‌మ్మా,,! Andhra Prabha Crime Story

  • ప్రాణాలు ఫ‌ణంఆ పెట్టి ..
  • పిల్ల రాక్ష‌సుడితో షైట్
  • న‌ర‌మేధానికి బ్రేక్
  • చిన్నారును కాపాడిన ధీర నారి
  • ఓ తండ్రి ఎంట్రీ,,, హంత‌కుడు ఖ‌తం

( ఒరెగాన్ ; ఆంధ్రప్రభ, ప్రతినిధి )

అమెరికాలోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. తరగతి గదిలోకి చొరబడి చిన్నారులపై కాల్పులు జరిపిన ఓ టీనేజర్‌ను అడ్డుకునేందుకు ఉపాధ్యాయురాలు ప్రాణాలకు తెగించి పోరాడారు. చేతిలోని మొబైల్‌ ఫోన్‌ను పక్కకు విసిరేసి.. నిందితుడి చేతుల్లో ఉన్న షాట్‌గన్‌ను లాక్కునేందుకు ప్రయత్నించారు. నేలపై అతడితో పెనుగులాడారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఇద్దరు కుమార్తెల తండ్రి.. కాల్పుల విషయం గుర్తించి పాఠశాలలోకి ప్రవేశించారు. తన వద్ద ఉన్న తుపాకీతో నిందితుడిని కాల్చి చంపారు.
అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు, ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. అమెరికాలోని ఒరెగాన్‌ రాష్ట్రం బెండ్‌ నగరంలోని సిల్వర్‌ రైల్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
తరగతి గదిలోకి చొరబడి.. విచక్షణారహితంగా కాల్పులు
ప్రత్యేక విద్యా అవసరాలు ఉన్న చిన్నారుల తరగతిని లక్ష్యంగా చేసుకుని నిందితుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. తొలుత పాఠశాల ఆవరణలో పార్క్‌ చేసిన ఓ వాహనంపై కాల్పులు జరిపిన అతడు.. ఆ తర్వాత కిటికీ గుండా లోపలికి ప్రవేశించినట్లు ప్రత్యక్ష పరిణామాల ఆధారంగా వెల్లడించారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. 16 ఏళ్ల గ్రిఫిన్‌ జె. జాన్‌ రెండో అనే యువకుడు గతంలో ఇదే పాఠశాలలో చదువుకున్నాడు. అతడు ప్రత్యేక విద్యా అవసరాలు ఉన్న విద్యార్థిగా అక్కడ విద్యనభ్యసించినట్లు అధికారులు గుర్తించారు.
తరగతి గదిలోకి ప్రవేశించిన తర్వాత నిందితుడు సుమారు 15 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతడిని అడ్డుకున్న సమయంలో ఇంకా దాదాపు 44 రౌండ్ల షాట్‌గన్‌ మందుగుండు సామగ్రి అతడి వద్ద ఉన్నట్లు తెలిపారు.
ఫోన్‌ విసిరేసి.. టీచర్‌ పోరాటం

కాల్పులు జరుగుతున్న సమయంలో అక్కడి ఉపాధ్యాయురాలు చూపిన ధైర్యం పలువురిని కదిలించింది. నిందితుడిని నిలువరించేందుకు ఆమె నేరుగా అతడిపైకి దూసుకెళ్లారు. తన మొబైల్‌ ఫోన్‌ను పక్కకు విసిరేసి, అతడి చేతుల్లోని షాట్‌గన్‌ను లాక్కునేందుకు ప్రయత్నించారు. తరగతి గదిలో నేలపై ఇద్దరి మధ్య పెనుగులాట సాగింది. ఆ సమయంలో అక్కడి పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. అయినప్పటికీ, ఉపాధ్యాయురాలు వెనక్కి తగ్గకుండా నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి పాఠశాల బయట కాల్పులు జరుగుతున్నట్లు గుర్తించారు. వెంటనే లోపలికి వెళ్లి నిందితుడిని ఎదుర్కొన్నారు. ఆయన జరిపిన కాల్పుల్లో 16 ఏళ్ల యువకుడు మరణించాడు.
‘మరింత ప్రాణనష్టం జరగకుండా అడ్డుకున్నారు’
ఈ ఘటనపై శుక్రవారం మీడియా సమావేశంలో బెండ్‌ పోలీస్‌ చీఫ్‌ మైక్‌ క్రాంట్జ్‌ వివరాలు వెల్లడించారు. దాడి సమయంలో ధైర్యంగా జోక్యం చేసుకున్న ఉపాధ్యాయురాలు, మరో వ్యక్తి చర్యలను ప్రశంసించారు.
‘‘ఇంతటి హింసాత్మక పరిస్థితుల్లో ధైర్యం చూపించి, ఈ విషాదం మరింత తీవ్రం కాకుండా అడ్డుకున్న వారికి మనం కృతజ్ఞతలు చెప్పాలి’’ అని ఆయన పేర్కొన్నారు.
నిందితుడితో పెనుగులాడిన ఉపాధ్యాయురాలికి గాయాలు కాలేదని తెలిపారు. అయితే, ఆమె చర్యలు మరింత రక్తపాతాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించి ఉంటాయని చెప్పారు. కాల్పులు జరిపిన యువకుడి ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు వారెంట్‌ అమలు చేసినట్లు, దర్యాప్తు కొనసాగుతోందని పోలీస్‌ చీఫ్‌ వెల్లడించారు. నిందితుడు కాలినడకన పాఠశాలకు చేరుకున్నాడని భావిస్తున్నప్పటికీ.. అతడి కదలికలు, తుపాకీ ఎక్కడి నుంచి సంపాదించాడన్న అంశాలపై విచారణ జరుగుతోందన్నారు. దాడికి కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదని తెలిపారు.

నలుగురు మృతి.. ఇద్దరికి గాయాలు

ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన నలుగురిలో ఇద్దరి వివరాలను పోలీసులు వెల్లడించారు. ఐదేళ్ల రోమ్‌ సమ్మర్‌, 25 ఏళ్ల ఉపాధ్యాయురాలు మేఘన్‌ లాంబర్ట్‌ మృతిచెందినట్లు తెలిపారు. మరణించిన మరో ఇద్దరు చిన్నారుల వయసులు ఎనిమిది, పదకొండు సంవత్సరాలు. వారి కుటుంబాలు ప్రస్తుతం పేర్లను బహిరంగంగా వెల్లడించేందుకు ఇష్టపడలేదని పోలీసులు చెప్పారు.
ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. 54 ఏళ్ల మరో ఉపాధ్యాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడేళ్ల విద్యార్థి పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ, ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

‘వాళ్లను కాపాడేందుకు లోపలికి వెళ్లా’

కాల్పులు జరిపిన నిందితుడిని అడ్డుకుని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించిన వ్యక్తి పేరు పోలీసు అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. అయితే, అమెరికా మీడియాతో మాట్లాడిన అతడి కుటుంబ సభ్యులు 36 ఏళ్ల కైలబ్‌ జియామాంకోగా గుర్తించారు. వృత్తిరీత్యా కార్పెంటర్‌ అయిన కైలబ్‌.. గురువారం భోజనం ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో పాఠశాల సమీపం నుంచి వెళ్తుండగా కాల్పులు కనిపించాయి. పాఠశాల బయట ఓ వాహనంపై నిందితుడు కాల్పులు జరపడం, ఆపై కిటికీ గుండా లోపలికి వెళ్లడం ఆయన గమనించారు.
కైలబ్‌ వాహనంలో చట్టబద్ధంగా దాచుకునే అనుమతి ఉన్న .40 కాలిబర్‌ తుపాకీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్న ఆయన.. తుపాకీ తీసుకుని పాఠశాలలోకి ప్రవేశించారని ఆయన సోదరుడు ఎన్బీసీ న్యూస్‌కు వివరించారు. పోలీసుల ప్రకారం.. కైలబ్‌ నిందితుడిపై పలుమార్లు కాల్పులు జరపడంతో అతడు మరణించాడు. ఆ సమయంలో అక్కడ ఎంతటి ప్రమాదకర పరిస్థితి నెలకొన్నదో ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.
‘అమ్మా.. పిల్లలను కాల్చేశాడు.. అందరినీ కాపాడలేకపోయా’
కాల్పుల ఘటన అనంతరం కైలబ్‌ తన తల్లి కెండా ఫ్రీమన్‌కు ఫోన్‌ చేశారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో నివసిస్తున్న ఆమెకు తన కుమారుడు చెప్పిన మాటలు ఇప్పటికీ కలచివేస్తున్నాయి. తన కుమారుడు ఫోన్‌లో జరిగిన ఘటనను వివరిస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యాడని ఆమె స్థానిక సీబీఎస్‌ ఛానల్‌కు తెలిపారు.
‘‘మా అమ్మాయి చదువుతున్న పాఠశాలలోకి ఓ వ్యక్తి వెళ్లాడు’’ అని కైలబ్‌ చెప్పినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ.. ‘‘పిల్లలపై కాల్పులు జరిపాడు. నేను అతడిని ఎదురుగా చూశాను.. కాల్చి చంపాను అమ్మా’’ అని చెప్పినట్లు వెల్లడించారు. తన కుమారుడితో మాట్లాడుతూ.. అతడు ఎంతోమంది ప్రాణాలను కాపాడాడని చెప్పానని కెండా తెలిపారు. అందుకు తన కుమారుడు ఇచ్చిన సమాధానం తనను మరింత కలచివేసిందన్నారు.
‘‘అమ్మా.. నేను అందరినీ కాపాడలేకపోయాను’’ అని కైలబ్‌ చెప్పినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కైలబ్‌ను ‘గొప్ప హీరో : ట్రంప్‌

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం స్పందించారు. కాల్పులను అడ్డుకునేందుకు ముందుకొచ్చిన వ్యక్తిని ‘గొప్ప హీరో’గా అభివర్ణించారు. జార్జియా పర్యటనకు బయలుదేరే ముందు వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఆ వ్యక్తి జోక్యం చేసుకోకపోయి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా మారేదని వ్యాఖ్యానించారు. ‘‘ఇది భయంకరమైన ఘటన. అయితే, తుపాకీ కలిగి ఉండి దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసిన ఓ వ్యక్తి అక్కడ ఉండటం వల్ల మరింత ప్రాణనష్టం తప్పింది’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.ఒరెగాన్‌ గవర్నర్‌ టీనా కోటెక్‌ కూడా నిందితుడిని అడ్డుకునేందుకు ముందుకొచ్చిన వ్యక్తి చర్యలను గుర్తించారు. అయితే, ఇలాంటి ఘటనలను ప్రత్యక్షంగా ఎదుర్కొన్నవారిపై తీవ్ర మానసిక భారం పడుతుందని పేర్కొంటూ.. బాధిత కుటుంబాలతో పాటు ఆ వ్యక్తికి కూడా తన ఆలోచనలు, సానుభూతి ఉంటాయని తెలిపారు.

ధైర్యం ప్ర‌ద‌ర్శించినా తీరని విషాదం!

పాఠశాల అంటే పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన ప్రదేశం. అలాంటి చోట తుపాకీ శబ్దాలు మార్మోగడం, చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అమెరికాలో మరోసారి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఓ ఉపాధ్యాయురాలు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మరోవైపు, అటుగా వెళ్తున్న వ్యక్తి ప్రమాదాన్ని గుర్తించి పాఠశాలలోకి ప్రవేశించారు. వారి చర్యలు మరింత ప్రాణనష్టం జరగకుండా అడ్డుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ ధైర్యసాహసాల వెనుక మిగిలింది నలుగురు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల తీరని వేదన. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆందోళన. ఇక తమ పిల్లలను తిరిగి చూడలేని తల్లిదండ్రుల కన్నీళ్లు.
ఒకవైపు ప్రాణాలు కాపాడేందుకు ప్రాణాలకు తెగించిన ధైర్యం.. మరోవైపు చిన్నారుల ప్రాణాలను బలిగొన్న తుపాకీ హింస.. అమెరికా పాఠశాలలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.