Revanth Reddy | ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో విచారణకు ఆదేశం..

  • 22ఏ సమస్యల పరిష్కారానికి హైపవర్‌ కమిటీ..
  • 22ఏ భూములు, ధరణిపై అసెంబ్లీలో రేవంత్‌ తీవ్ర వ్యాఖ్యలు
  • కేసీఆర్‌ కుటుంబ భూములపై లెక్కలు వెల్లడించిన సీఎం..
  • భూములను నిషేధిత జాబితాలో చేర్చే ముందు 15 రోజుల అభ్యంతరాల అవకాశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో 22ఏ నిషేధిత భూములు, ధరణి వ్యవస్థపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ధరణి వ్యవస్థను అడ్డుపెట్టుకుని భూముల విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నీటి ప్రాజెక్టుల తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి భూములపై పడిందని, భూదోపిడీ ఆలోచనల నుంచే ధరణి వ్యవస్థ పుట్టిందని వ్యాఖ్యానించారు. ధరణి ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యగా మారిందన్నారు. ధరణిని తాము రూపొందించామని కేసీఆర్‌, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ చెప్పుకున్నారని, అయితే ధరణి ఆలోచన తెలంగాణలో పుట్టినది కాదని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 2010లో ఒడిశాలో ఈ తరహా వ్యవస్థ ప్రారంభమైందని, 2014లో కాగ్‌ కూడా దానిపై విమర్శలు చేసిందని సీఎం తెలిపారు. 2018లో ధరణి కాంట్రాక్టును ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంస్థ దక్కించుకుందని, అనంతరం దానిని టెరాసిస్‌ సంస్థకు విక్రయించిందని చెప్పారు. టెరాసిస్‌లో శ్రీధరరాజుకు వాటా ఉందని సభలో పేర్కొన్నారు.

22ఏ నిషేధిత జాబితాలో కోటి ఎకరాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. రాష్ట్రంలో అటవీ, అసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌, శిఖం, ప్రభుత్వ తదితర రక్షిత భూములు నిషేధిత జాబితాలో ఉండాల్సిందేనని చెప్పారు. సుమారు 98 లక్షల నుంచి కోటి ఎకరాల వరకు ఇలాంటి భూములు ఉన్నాయని, వాటిని జాబితా నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. అలాంటి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తే పేదలకు, ప్రభుత్వానికి అన్యాయం చేసినట్లవుతుందని పేర్కొన్నారు. అసలు వివాదం ప్రైవేటు పట్టా భూములకు సంబంధించిన సుమారు 3.73 లక్షల నుంచి 3.77 లక్షల ఎకరాల వరకేనని, వాటిని చూపించి కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చినట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పెద్ద మొత్తంలో భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయని, తమ ప్రభుత్వం ఇప్పటికే సుమారు మూడు లక్షల ఎకరాలను జాబితా నుంచి తొలగించిందని సీఎం తెలిపారు. ప్రస్తుతం మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు.

భూముల సమస్యకు చారిత్రక నేపథ్యం

భూముల సమస్యలకు నిజాం కాలం నుంచి చారిత్రక నేపథ్యం ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. 1908లో నిజాం ప్రభుత్వం రెవెన్యూ విధానాన్ని అమలు చేసిందని, 1936లో భూహక్కుల రికార్డుల నిర్వహణకు చట్టం తీసుకొచ్చిందని వివరించారు. 1948 నుంచి 1954 మధ్య భూముల వివరాలను నమోదు చేసి చసాలా పహానీ రూపొందించారని, ఇప్పటికీ కాస్రా పహానీని అధికారిక రికార్డుగా పరిగణిస్తున్నామని చెప్పారు. రికార్డులపై సందేహాలు తలెత్తినప్పుడు వాటిని పరిశీలిస్తారని తెలిపారు. 1975లో కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజన భూముల రక్షణ కోసం 1/70 చట్టాన్ని తీసుకొచ్చిందని, గిరిజనుల భూములను గిరిజనేతరులు కొనుగోలు చేయకుండా నిబంధనలు రూపొందించిందన్నారు. అసైన్డ్‌ భూముల బదలాయింపునూ నిషేధించారని, పేదలు భూహక్కులను అనుభవించడానికి గత ప్రభుత్వాలు తీసుకున్న భూ సంస్కరణలే కారణమని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మండల స్థాయిలో ఉన్న భూ రికార్డులను కలెక్టరేట్లకు తరలించి, డిజిటలైజేషన్‌ పేరుతో మార్పులు చేశారని సీఎం ఆరోపించారు. ప్రస్తుతం కొన్ని రికార్డులు ఉన్నాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. భూదాన్‌ భూములు కూడా కబ్జాలకు గురయ్యాయని, వాటికి సంబంధించిన వివరాలను బయటపెడతానని చెప్పారు. ధరణి పేరుతో జరిగిన వ్యవహారాల ద్వారా లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కొందరి చేతుల్లోకి వెళ్లాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేశారని, ఆయన భూములకు ఉన్న బాధ్యత ఎంతైతే ప్రభుత్వానిదీ అంతేనని అన్నారు. నిషేధిత భూములను జాబితా నుంచి తొలగించాలని కేసీఆర్‌తో లేఖ రాయించగలరా అని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. తాము భూములను కాపాడేందుకే ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

కేసీఆర్‌ కుటుంబ భూములపై సీఎం లెక్కలు

అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ కుటుంబం, సమీప బంధువుల పేర్లపై ఉన్న భూముల వివరాలను కూడా రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో 24 మండలాలు, 31 గ్రామాల్లో కలిపి సుమారు 439 ఎకరాల భూములు ఉన్నట్లు వెల్లడించారు. కేసీఆర్‌ కుటుంబానికి సుమారు 67.5 ఎకరాలు, కేటీఆర్‌ కుటుంబానికి 123 ఎకరాలు, హరీశ్‌రావు కుటుంబానికి 30 ఎకరాలు, కవిత కుటుంబానికి 37 ఎకరాలు, జోగినిపల్లి సంతోష్‌రావు కుటుంబానికి 79 ఎకరాలు, నవీన్‌రావు పేరుతో 52 ఎకరాలు, కొండల్‌రావు పేరుతో 48 ఎకరాలు ఉన్నట్లు సీఎం సభలో పేర్కొన్నారు. కేటీఆర్‌ పేరుతో 49.4 ఎకరాలు, శైలిమ పేరుతో సుమారు 15 ఎకరాలు, అలేఖ్య పేరుతో భూములు, హిమాన్షు పేరుతో కూడా భూములు ఉన్నట్లు వివరించారు. భూముల వివరాలను అగ్రికల్చర్‌ సీలింగ్‌ చట్టం నిబంధనల నేపథ్యంలో పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ భూముల విషయంలో కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించే నిబంధనలను సీఎం ప్రస్తావించారు.

హరీశ్‌రావు కుటుంబానికి చెందిన భూములపైనా సీఎం ఆరోపణలు చేశారు. హరీశ్‌రావు పేరుతో, ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న భూముల వివరాలను ప్రస్తావించారు. సిద్దిపేట మున్సిపాలిటీ నిధులతో హరీశ్‌రావు ఫాంహౌస్‌కు రహదారులు వేయించినట్లు ఆరోపించారు. ఇరిగేషన్‌ అవసరాల కోసం తీసుకున్న భూమిలోనే ఫాంహౌస్‌ ఉందని అన్నారు. హైదరాబాద్‌ బాలానగర్‌లో 120 ఎకరాల భూమికి సంబంధించి కూడా ఆరోపణలు చేశారు. సత్యం కుంభకోణానికి సంబంధించిన భూముల్లోనే కేటీఆర్‌ ఫాంహౌస్‌ ఉందని, ఆ భూములు కేటీఆర్‌ బంధువుల పేర్లకు బదిలీ అయ్యాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గంగుల, ఎర్రబెల్లి, సుధీర్‌రెడ్డి తదితరుల భూములపై కూడా సీఎం పలు ఆరోపణలు చేశారు. జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పైలట్‌ రోహిత్‌రెడ్డి అజీజ్‌నగర్‌లో అసైన్డ్‌ భూమిలో ఫాంహౌస్‌ నిర్మించుకున్నారని పేర్కొన్నారు.

ఎర్రవల్లి ఫాంహౌస్‌పై 30 రోజుల్లో విచారణ

గజ్వేల్‌ నియోజకవర్గం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌ భూములపై సమగ్ర విచారణ జరపాలని రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కేసీఆర్‌కు చెందిన ఫాంహౌస్‌ పరిధిలో సుమారు 700 ఎకరాల భూమి ఉందని, అందులో ప్రభుత్వ భూమి ఉందా లేదా అన్నది తేల్చాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఫాంహౌస్‌ భూములపై కేసీఆర్‌కు వెంటనే నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని, 30 రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఫాంహౌస్‌ పరిధిలో ప్రభుత్వ భూమి ఉన్నట్లు విచారణలో తేలితే ఆ భూమిని స్వాధీనం చేసుకుని పేదలకు, ముఖ్యంగా దళితులకు పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. అయితే భూముల వాస్తవ స్థితి అధికారుల విచారణలో నిర్ధారణ అయిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

ఎర్రవల్లి ఫాంహౌస్‌కు సంబంధించిన భూములపై మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుందని సీఎం తెలిపారు. ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేలితే దానిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించినా, నిబంధనలకు విరుద్ధంగా బదలాయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

22ఏలో భూములు చేర్చే విధానంపై కొత్త ప్రక్రియ

22ఏ నిషేధిత జాబితాలో ఏదైనా భూమిని చేర్చే ముందు నిర్దిష్టమైన విధానాన్ని అనుసరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సబ్‌కలెక్టర్‌, ఆర్డీవో స్థాయి అధికారులు మాత్రమే విచారణ ప్రక్రియను ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్వే నంబర్‌, సబ్‌డివిజన్‌, విస్తీర్ణం, పట్టాదారు, యజమాని వివరాలను గుర్తిస్తారని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో వార్డు, బ్లాక్‌, ప్లాట్‌, డోర్‌ నంబర్‌ తదితర వివరాలను నమోదు చేస్తారని వివరించారు. రెవెన్యూ, దేవాదాయ, వక్ఫ్‌ తదితర సంబంధిత రికార్డులను పరిశీలించి భూమి ప్రస్తుత స్థితిని నిర్ధారిస్తారని తెలిపారు.

ఒక సర్వే నంబర్‌లో కొంత భాగం మాత్రమే నిషేధిత భూమి అయితే మొత్తం సర్వే నంబర్‌ను కాకుండా ఆ భాగాన్ని మాత్రమే 22ఏ జాబితాలో చేర్చే విధానాన్ని అమలు చేస్తామని సీఎం చెప్పారు. సంబంధిత భూ యజమానికి ముందుగా కేవైసీ ద్వారా నోటీసు ఇస్తామని, అందుబాటులో లేకపోతే ఈ-మెయిల్‌, ఆధార్‌కు అనుసంధానమైన చిరునామాకు రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా సమాచారం పంపిస్తామని తెలిపారు. అవసరమైతే స్థానిక పత్రికల్లో ప్రకటన ఇచ్చి 15 రోజులపాటు అభ్యంతరాలు, ఆధారాలు సమర్పించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. విచారణ ప్రక్రియ, సంబంధిత పత్రాలు, తుది ఉత్తర్వుల వివరాలను భూ యజమానికి అందజేస్తామని తెలిపారు.

వ్యవసాయ భూమి విస్తీర్ణం ఒక ఎకరానికి మించి ఉన్న సందర్భాల్లో, వ్యవసాయేతర భూమి వెయ్యి గజాలకు మించి ఉన్న సందర్భాల్లో నిర్దేశిత విధానం ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకున్న తర్వాతే 22ఏ జాబితాలో నమోదు చేస్తామని సీఎం వివరించారు. మొత్తం విచారణ ప్రక్రియ పూర్తయ్యాకే భూమి వివరాలను ఐజీఆర్‌ఎస్‌ రికార్డుల్లో నమోదు చేస్తామని, ఆన్‌లైన్‌ డేటాబేస్‌లోనూ చేర్చుతామని తెలిపారు. 22ఏ జాబితాలో మాన్యువల్‌గా భూములను చేర్చే అవకాశం లేకుండా పారదర్శక విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

యూఎల్‌సీ, దేవాదాయ, వక్ఫ్‌ భూములపై నిర్ణయాలు

అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ భూముల విషయంలో త్వరలో కొత్త విధానం తీసుకొస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. 22ఏ జాబితాలో చేర్చే ముందు ఈ-కేవైసీ, ఈ-మెయిల్‌, పత్రికా ప్రకటన వంటి విధానాలను అనుసరిస్తామని చెప్పారు. దేవాదాయ, వక్ఫ్‌ భూములను చట్టబద్ధంగా కొనుగోలు చేసిన సందర్భాల్లో వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించే అవకాశం కల్పిస్తామని తెలిపారు. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులు పొందిన లేఅవుట్లలో పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లను పరిష్కరిస్తామని చెప్పారు. అధికారిక అనుమతులు పొందిన లేఅవుట్ల రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సింగరేణి పరిధిలో అర్హత ఉన్న వారికి నిబంధనల ప్రకారం పట్టాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు.

12 ప్రధాన సమస్యల గుర్తింపు.. హైపవర్‌ కమిటీ

22ఏ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 12 ప్రధాన అంశాలను గుర్తించామని ముఖ్యమంత్రి తెలిపారు. వీటి పరిష్కారానికి హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భూముల సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసి చర్యలు ప్రారంభించామని చెప్పారు. 22ఏలో ఏ రకమైన భూములను చేర్చాలన్నదానిపై నిర్దేశిత విధానంతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

భూ సమస్యల్లో సాంకేతిక లోపాల వల్ల కొన్ని వ్యక్తిగత ఆస్తులు కూడా నిషేధిత జాబితాలో కనిపించిన సందర్భాలు ఉన్నాయని సీఎం అంగీకరించారు. ఒక సర్వే నంబర్‌లో కేవలం ఒక ఎకరం ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ మొత్తం సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలకు బాధ్యులైన నలుగురు అధికారులను సస్పెండ్‌ చేసినట్లు చెప్పారు. గతంలో సుమారు ఏడు లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని, తమ ప్రభుత్వం వాటిలో సుమారు మూడు లక్షల ఎకరాలను తొలగించిందని పేర్కొన్నారు.

ఎల్బీనగర్‌ 118 జీఓపై పరిష్కారం

ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో 118 జీఓ పరిధిలో ఉన్న భూ సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఏళ్లుగా నివసిస్తున్న ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు. ప్రభుత్వ భూముల్లోని లేఅవుట్లు, నిర్మాణాలను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఎల్బీనగర్‌లో పెండింగ్‌లో ఉన్న సుమారు 9,500 దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, అర్హత ఉన్నవారి స్థలాలను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్‌ పరిధిలో ఫ్రీహోల్డ్‌, భూదాన్‌ భూములకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలిపారు.

భూముల సమస్య కేవలం ప్రస్తుత ప్రభుత్వ కాలంలో ఏర్పడినది కాదని, నిజాం కాలం నుంచి వివిధ దశల్లో ఏర్పడిన సమస్యలు, భూ సంస్కరణలు, కోర్టు తీర్పులు, ప్రభుత్వ ఉత్తర్వులు, 22ఏ నిబంధనలు అన్నింటినీ సమగ్రంగా పరిశీలించాల్సి ఉందని సీఎం పేర్కొన్నారు. ధరణి వ్యవస్థలో గతంలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై కూడా విచారణ అవసరమన్నారు. ప్రభుత్వ, అసైన్డ్‌, అటవీ, దేవాదాయ, వక్ఫ్‌, భూదాన్‌ భూములను రక్షించడంతో పాటు నిజమైన పట్టాదారుల భూములు నిషేధిత జాబితాలో చేరకుండా పారదర్శక విధానాన్ని అమలు చేయడమే తమ లక్ష్యమని రేవంత్‌రెడ్డి తెలిపారు.

కేసీఆర్‌ సభకు ఎందుకు రావడం లేదన్న సీఎం

22ఏ భూముల వ్యవహారంపై చర్చ సందర్భంగా కేసీఆర్‌ సభకు హాజరుకాకపోవడాన్ని కూడా రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. కేసీఆర్‌కు భూముల వ్యవహారాలపై అన్ని వివరాలు తెలుసని, అందుకే సభకు రావడం లేదని ఆరోపించారు. తాను ప్రస్తావించిన అంశాలకు కేసీఆర్‌ సభలో సమాధానం చెప్పాల్సి ఉందని అన్నారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు సభలో గందరగోళం సృష్టించి సస్పెన్షన్‌కు గురయ్యారని పేర్కొన్నారు. భూములపై తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉందన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారుల త్యాగాలను కూడా సీఎం తన ప్రసంగంలో ప్రస్తావించారు. సమ్మక్క, కొమురం భీమ్‌తో పాటు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టు ఉద్యమకారులు, ప్రజల హక్కుల కోసం పోరాడిన అనేక మంది ఆస్తులు కోల్పోయారని అన్నారు. ఉద్యమకారుల కుటుంబాలు నష్టపోయాయని పేర్కొంటూ.. తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్‌ కుటుంబం వేల కోట్ల రూపాయల ఆస్తులు, వందల ఎకరాల భూములు సంపాదించుకుందని ఆరోపించారు. కాంట్రాక్టులు, భూముల బదలాయింపులు తదితర అంశాలపై కూడా సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు.

22ఏ నిషేధిత భూముల విషయంలో ప్రభుత్వ, రక్షిత భూములను కాపాడటంతో పాటు నిజమైన ప్రైవేటు భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామని సీఎం స్పష్టం చేశారు. భూమిని 22ఏ జాబితాలో చేర్చే ముందు విచారణ, నోటీసు, అభ్యంతరాల స్వీకరణ, పత్రాల పరిశీలన వంటి ప్రక్రియలను తప్పనిసరి చేస్తామని తెలిపారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా హైపవర్‌ కమిటీ ద్వారా చర్యలు తీసుకుంటామని, భూ రికార్డులను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు.