పిల్ల‌ల్లో అరుదైన వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

పది నెలల పసికందుకు అరుదైన ఆపరేషన్‌..
‘హాప్లోయిడెంటికల్‌ స్టెమ్‌ సెల్‌’ మార్పిడితో కొత్త జీవితం

మహబూబ్‌నగర్‌ రూరల్‌, ఆంధ్రప్రభ : పిల్లల్లో వచ్చే అరుదైన వ్యాధులపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సోమాజిగూడ యశోద ఆస్పత్రి బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ నిపుణుడు డాక్టర్‌ విక్రమ్‌కుమార్‌ సూచించారు. వారసత్వంగా వచ్చే అరుదైన ఎముక మజ్జ వైఫల్య వ్యాధితో బాధపడుతున్న పది నెలల చిన్నారికి యశోద ఆస్పత్రి వైద్యులు అత్యాధునిక ‘హాప్లోయిడెంటికల్‌ స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌’ నిర్వహించి విజయవంతంగా చికిత్స అందించారు.

విలేకరుల సమావేశంలో బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ నిపుణుడు డాక్టర్‌ విక్రమ్‌కుమార్‌ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నందవరం గ్రామానికి చెందిన ముళ్ల ఖాజా, రేష్మ దంపతుల పది నెలల కుమారుడు ఎం. ఖాదర్‌ అర్మాన్‌కు ప్లేట్‌లెట్ల సంఖ్య తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు గత ఏడాది డిసెంబర్‌ 26న చిన్నారిని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారు. సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చిన్నారి ‘అమెగాకార్యోసైటిక్‌ థ్రోంబోసైటోపెనియా’ అనే అరుదైన వారసత్వ ఎముక మజ్జ వైఫల్య వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు.

అరుదైన వ్యాధికి అత్యాధునిక చికిత్స

ఈ వ్యాధి కారణంగా శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తీవ్రంగా తగ్గిపోతుందని, దీంతో రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలిపారు. సరైన సమయంలో చికిత్స అందించకపోతే ప్రాణాపాయం కూడా ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. చిన్నారి తండ్రి నుంచి సేకరించిన మూలకణాలను ఉపయోగించి జనవరి 8న హాప్లోయిడెంటికల్‌ స్టెమ్‌ సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విజయవంతంగా నిర్వహించినట్లు డాక్టర్‌ విక్రమ్‌కుమార్‌ తెలిపారు.

ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉంది

చికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించామని, వైద్యపరంగా స్థిరంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత డిశ్చార్జ్‌ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యశోద ఆస్పత్రి మేనేజర్‌ రాజ్‌కుమార్‌ మిశ్రా, అసిస్టెంట్‌ మేనేజర్‌ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.