ఊట్కూర్ రైల్వే స్టేషన్ క్రాసింగ్ స్టేషన్ గా అప్‌గ్రేడ్

ఊట్కూర్ రైల్వే స్టేషన్ క్రాసింగ్ స్టేషన్ గా అప్‌గ్రేడ్

దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో భేటీ అయిన మంత్రి వాకిటి శ్రీహరి
ఈ ప్రాజెక్టు వల్ల 30 గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరుతుంది


ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లాలో దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో వికారాబాద్-కృష్ణా నూతన రైల్వే లైన్ ఏర్పాటులో భాగంగా ఊట్కూర్ వద్ద క్రాసింగ్ స్టేషన్ గా అప్‌గ్రేడ్ చేయడం స్థానిక ప్రజల చిరకాల ఆకాంక్ష అని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. మంగళవారం రైల్వే నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ తో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ అయ్యారు.ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మక్తల్ – నారాయణపేట – వికారాబాద్ జిల్లా ప్రాంతాలతో పాటు, అనేక గ్రామాల ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు భూసేకరణ కోసం రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే రూ.438 కోట్లు కేటాయించడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

122 కి.మీ రైల్వే లైన్ కృష్ణా-మక్తల్-నారాయణపేట-దామర్గిద్ద-బాలంపేట-దౌల్తాబాద్-కొడంగల్-పరిగి-వికారాబాద్ అలైన్‌మెంట్ భాగంగా ఊట్కూర్ స్టేషన్లలో ఒకటిగా గుర్తించబడింది. దీనిని క్రాసింగ్ స్టేషన్ గా అప్ గ్రేడ్ చేయడం వల్ల స్థానికంగా 30 గ్రామాల ప్రజలు దాదాపుగా 60,000 లకు పైగా ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. వీరంతా కూడ జీవనోపాధి కోసం వివిధ నగరాలకు వెళ్లి రావడానికి వీలుగా ఉంటుందని ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఊట్కూర్ రైల్వే స్టేషను క్రాసింగ్ స్టేషన్ గా అప్ గ్రేడ్ చేయాలని కోరారు.

ఈ అంశంపై దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సానుకూలంగా స్పందించి అప్ గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జిఎం కోట్ల ఉదయ్ నాథ్,రైల్వే సెక్రటరీ శ్రీనివాస్,ఊట్కూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యజ్ఞేశ్వర్ రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply