వినాయక చవితికి ఊట్కూర్‌లో ముందస్తు ఏర్పాట్లు

వార్డుల్లో రహదారుల మరమ్మతులు ప్రారంభం..
భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

ఊట్కూర్, ఆంధ్రప్రభ : వినాయక చవితి పర్వదిన వేడుకలను పురస్కరించుకుని నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండల కేంద్రంలో ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. సర్పంచ్‌ ఎం. రేణుక భరత్‌ ఆధ్వర్యంలో బుధవారం ఆయా వార్డుల్లో రహదారుల మరమ్మతు పనులను ప్రారంభించారు.

వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రహదారులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు సర్పంచ్‌ తెలిపారు. ప్రజలు, భక్తులు సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేలా అవసరమైన ప్రాంతాల్లో మరమ్మతులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ ఎం. రేణుక భరత్‌ మాట్లాడుతూ ఈనెల 14న వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని వార్డుల్లో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పండుగను ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ రమేష్‌, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి తారా కృష్ణ, కార్యకర్తలు బాలాంజనేయులు, నరేష్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.