ఈ-ఆఫీస్ వ్యవస్థకు కలెక్టర్ శ్రీకారం

ఈ-ఆఫీస్ వ్యవస్థకు కలెక్టర్ శ్రీకారం
పేపర్లెస్ పరిపాలనకు తొలి అడుగు
సేవలు వేగవంతం పారదర్శకత పెంపు లక్ష్యం
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ అర్బన్, ఆంధ్రప్రభ : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న ఈ-ఆఫీస్ నిర్వహణ ద్వారా ఫైళ్ల పరిష్కారం పారదర్శకంగా, వేగవంతం అవుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిపాలనను ఆధునికీకరించి పనితీరులో జవాబుదారీతనాన్ని పెంచే విధంగా ఈ-ఆఫీస్ నిర్వహణకు శ్రీకారం చుట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కార్యాలయాల్లో పేపర్ వినియోగాన్ని తగ్గిస్తూ, ఫైళ్లను ఆన్లైన్ ద్వారా నిర్వహించే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ-ఆఫీస్ అమలు ద్వారా ఫైళ్ల ప్రాసెసింగ్ వేగవంతమవుతుందని, నిర్ణయాలు త్వరితగతిన తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.ప్రతి శాఖలో ఈ విధానాన్ని సమర్థవంతంగా వినియోగించి, ప్రజలకు సేవలు మరింత మెరుగ్గా అందించాలని ఆదేశించారు.
అలాగే అధికారులు, సిబ్బంది ఈ-ఆఫీస్ వ్యవస్థపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అవసరమైన శిక్షణను పొందాలని కలెక్టర్ సూచించారు. ఫైళ్ల నిల్వ, ట్రాకింగ్ సులభతరం అవుతుందని, పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.ఈ సమావేశంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
