ONGC Recruitment 2026 | టెన్త్ నుంచి డిగ్రీ విద్యార్హతతో ఉద్యోగాలు!
ఆంధ్రప్రభ వెబ్: ప్రభుత్వ రంగ సంస్థలో శిక్షణ పొందాలనుకునే నిరుద్యోగ యువతకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) శుభవార్త చెప్పింది. 2026-27 సంవత్సరానికి సంబంధించి భారీ అప్రెంటిస్ నియామక ప్రకటనను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 24 వర్క్ సెంటర్ల పరిధిలో మొత్తం 3,047 పోస్టులను భర్తీ చేయనుంది. వివిధ ట్రేడ్లు, విభాగాల్లో ట్రేడ్, డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లను ఎంపిక చేయనుంది. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు తమ విద్యార్హతలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 29న ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 20తో ముగియనుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ సూచించింది.
ఓఎన్‌జీసీ మొత్తం ఆరు సెక్టార్ల పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. నార్తర్న్, ముంబై, వెస్ట్రన్, ఈస్టర్న్, సదరన్, సెంట్రల్ సెక్టార్లలో ఖాళీలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా వెస్ట్రన్ సెక్టార్‌లో 1,166 పోస్టులు ప్రకటించారు. ఈస్టర్న్ సెక్టార్‌లో 674, ముంబై సెక్టార్‌లో 482 ఖాళీలున్నాయి.
సెక్టార్ల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
- నార్తర్న్ సెక్టార్ – 191
- ముంబై సెక్టార్ – 482
- వెస్ట్రన్ సెక్టార్ – 1,166
- ఈస్టర్న్ సెక్టార్ – 674
- సదరన్ సెక్టార్ – 267
- సెంట్రల్ సెక్టార్ – 267
మొత్తంగా 3,047 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అహ్మదాబాద్, అంకలేశ్వర్, మెహసానా, ముంబై, హజీరా, నజీరా, శివసాగర్, కాకినాడ, రాజమండ్రి, చెన్నై తదితర వర్క్ సెంటర్లలో ఖాళీలున్నాయి. అభ్యర్థులు తమకు అర్హత ఉన్న వర్క్ సెంటర్, ట్రేడ్‌ను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు..
పోస్టును బట్టి విద్యార్హతలను నిర్ణయించారు. పదో తరగతి ఉత్తీర్ణుల నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారి వరకు వివిధ విభాగాల్లో అవకాశాలున్నాయి. లైబ్రరీ అసిస్టెంట్ పోస్టుకు పదో తరగతి అర్హత సరిపోతుంది. కంప్యూటర్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్ డీజిల్, వెల్డర్ తదితర ట్రేడ్లకు సంబంధిత ఐటీఐ అర్హత ఉండాలి.
అలాగే ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ విభాగానికి బీకామ్, ల్యాబ్ కెమిస్ట్ పోస్టుకు బీఎస్సీ (కెమిస్ట్రీ), ఎగ్జిక్యూటివ్ హెచ్‌ఆర్‌కు బీబీఏ అర్హతగా నిర్ణయించారు. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, స్టోర్ కీపర్, సెక్రటేరియల్ ఆఫీస్ అసిస్టెంట్ తదితర విభాగాలకు సంబంధిత డిగ్రీలు అవసరం. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ వంటి ఇంజినీరింగ్ విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ అర్హతలున్న వారికి కూడా అవకాశాలున్నాయి. అయితే ప్రతి ట్రేడ్‌కు నిర్దేశించిన కనీస విద్యార్హతను తప్పనిసరిగా కలిగి ఉండాలి. సంబంధిత ఐటీఐ, సాంకేతిక విద్యార్హతలు గుర్తింపు పొందిన సంస్థల నుంచి పొంది ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 2026 నవంబర్ 29 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్ఠంగా 24 ఏళ్లు ఉండాలి. అంటే 2002 నవంబర్ 29 నుంచి 2008 నవంబర్ 29 మధ్య జన్మించినవారు అర్హులు. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్) అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.
నెలకు రూ.12,300 వరకు స్టైపెండ్
ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల పాటు అప్రెంటిస్ శిక్షణ అందిస్తారు. ఈ సమయంలో విద్యార్హత, అప్రెంటిస్ విభాగాన్ని బట్టి నెలవారీ స్టైపెండ్ చెల్లిస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.12,300, మూడేళ్ల డిప్లొమా అభ్యర్థులకు రూ.10,900 చెల్లిస్తారు. పదో తరగతి లేదా ఇంటర్ అర్హతతో ఎంపికైన ట్రేడ్ అప్రెంటిస్‌లకు రూ.8,200, ఏడాది ఐటీఐ అభ్యర్థులకు రూ.9,600, రెండేళ్ల ఐటీఐ అభ్యర్థులకు రూ.10,560 చొప్పున అందిస్తారు.అయితే అప్రెంటిస్ శిక్షణ పూర్తయినంత మాత్రాన ఓఎన్‌జీసీలో శాశ్వత ఉద్యోగం లభించదు. ప్రయాణ, వసతి, భోజన ఖర్చులకు సంస్థ ప్రత్యేక భత్యాలు చెల్లించదు.
రాతపరీక్ష లేదు.. మెరిట్ ఆధారంగా ఎంపిక
ఈ నియామకాలకు ప్రత్యేక రాతపరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ ప్రస్తవించలేదు. అభ్యర్థుల విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ట్రేడ్, విభాగం, వర్క్ సెంటర్ వారీగా వేర్వేరుగా తాత్కాలిక మెరిట్ జాబితాలను సిద్ధం చేస్తారు. అందులో అర్హత సాధించినవారిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు. ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన, ఇతర అర్హతల నిర్ధారణ అనంతరం తుది ఎంపిక చేపడతారు. వైద్యపరమైన అర్హతలు కూడా తప్పనిసరిగా ఉండాలి.
ఇలా దరఖాస్తు చేసుకోండి
అర్హులైన అభ్యర్థులు తమ ట్రేడ్, విభాగాన్ని బట్టి ఎన్‌ఎపీఎస్ , ఎన్‌ఎటీఎస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా సంబంధిత పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి వ్యక్తిగత, విద్యార్హతల వివరాలను నమోదు చేయాలి. అనంతరం ఓఎన్జీసీ అప్రెంటిస్ అవకాశాన్ని వెతికి, అర్హతకు సరిపోయే ట్రేడ్, వర్క్ సెంటర్‌ను ఎంపిక చేసుకోవాలి. .
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల: అక్టోబర్ 29, 2026
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 29, 2026
- దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 20, 2026
- వయసు లెక్కింపు తేదీ: నవంబర్ 29, 2026
- ఎంపిక జాబితా విడుదల: డిసెంబర్ 15, 2026
అభ్యర్థులు పూర్తి వివరాలు, ట్రేడ్‌వారీ అర్హతలు, వర్క్ సెంటర్ నిబంధనలు, దరఖాస్తు విధానాన్ని అధికారిక వెబ్‌సైట్ https://ongcindia.com/ లోని రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో పరిశీలించవచ్చు.
