పోటీ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధమై లక్ష్యాన్ని సాధించాలి

అభ్యర్థులకు కలెక్టర్ రాజర్షి షా సూచన
ఉచిత శిక్షణ కేంద్రంలో ముఖాముఖి

ఉట్నూర్, ఆంధ్రప్రభ: పోటీ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధమై, క్రమశిక్షణతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు పట్టుదలతో కృషి చేయాలని అభ్యర్థులకు సూచించారు.

బుధవారం ఉట్నూర్‌లోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌ను కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు, ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్‌తో కలిసి సందర్శించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్, ప్రిలిమినరీ పరీక్షలకు ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ పోటీ పరీక్షల విధానం, ప్రశ్నపత్రాల సరళి, సిలబస్, మార్కుల విభజన తదితర అంశాలను వివరించారు. పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి? సమయపాలన పాటిస్తూ రోజువారీ చదువును ఎలా కొనసాగించాలి? గత ప్రశ్నపత్రాలను ఏ విధంగా సాధన చేయాలి? అనే అంశాలపై పలు సూచనలు చేశారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదువుతూ అందుబాటులో ఉన్న శిక్షణ వనరులను సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

అనంతరం శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు కలెక్టర్, ప్రాజెక్టు అధికారి, సబ్ కలెక్టర్ చేతుల మీదుగా నోట్‌బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. వాటిని సద్వినియోగం చేసుకొని చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాబ్స్ డిస్ట్రిక్ట్ మేనేజర్ నాగభూషణం, బైటీసీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, సిబ్బంది, రీజనింగ్ ఫ్యాకల్టీ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.