ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై పూర్తి అవగాహన ఉండాలి

  • ఎన్నికల నిబంధనలు, విధివిధానాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి
  • పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలి
  • జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.ఆర్‌. కల్పశ్రీ

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వోలు), అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు (ఏఆర్వోలు) ఎన్నికల నిబంధనలు, విధివిధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.ఆర్‌. కల్పశ్రీ అన్నారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో శుక్రవారం ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ, నామినేషన్ల స్వీకరణ, నామినేషన్‌ పత్రాల పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా తయారీ, గుర్తుల కేటాయింపు, పోలింగ్‌ నిర్వహణ, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై అధికారులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని కల్పశ్రీ తెలిపారు. ఎన్నికల సంఘం జారీ చేసే మార్గదర్శకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వాటిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని, ఏవైనా సందేహాలుంటే శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకోవాలని అన్నారు. ఎన్నికలకు సంబంధించిన రికార్డులు, నివేదికలు, ఇతర అధికారిక పత్రాలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశను నిర్ణీత నిబంధనలు, కాలపరిమితికి అనుగుణంగా పూర్తి చేసి, ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ సూచించారు.

అంతకుముందు జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి. రమణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో పి. గ్లోరియా, కలెక్టరేట్‌ కేఆర్‌ఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్‌ బి.పి. ప్రభాకర్‌రావు, డిప్యూటీ సీఈవో వై. దోసిరెడ్డి, డ్వామా పీడీ డాక్టర్‌ కె.సి.హెచ్‌. అప్పారావు, డీపీవో పి. విజయభాస్కర్‌, ఆర్వోలు, ఏఆర్వోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.