సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఓటీపీ, సీవీవీ వివరాలు ఎవరికీ చెప్పొద్దు.. ఎస్ఐ తోట తిరుపతి సూచన
బెజ్జంకి, ఆంధ్రప్రభ: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెజ్జంకి ఎస్ఐ తోట తిరుపతి సూచించారు. సైబర్ జాగృత దినోత్సవం సందర్భంగా బుధవారం బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ఆకర్షణీయమైన ఆన్లైన్ ప్రకటనలు, అధిక లాభాలు వస్తాయనే నకిలీ పెట్టుబడి పథకాలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. క్రెడిట్, డెబిట్ కార్డుల ఓటీపీ, సీవీవీ వంటి రహస్య వివరాలను ఎవరికీ వెల్లడించకూడదన్నారు. అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘మీ డబ్బు.. మీ క్లిక్.. మీ ఎంపిక’ అనే నినాదంతో ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై అవగాహన పెంచుకోవాలని ఎస్ఐ కోరారు.
