వినోదం.. ఆహ్లాదం… ఆశ్చర్యం…
- ఆద్యంతం అబ్బురపరిచే విజయవాడ ఉత్సవ్…
- వినూత్న కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ శ్రీకారం…
- దసరా ఉత్సవాలకు మరింత శోభ తెచ్చేలా….
- సిద్ధమైన విజయవాడ ఉత్సవ్….
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఆధ్యాత్మికత, సంగీత, సాహిత్య, సాంస్కృతిక వైభవం, భక్తి, భిన్నత్వం కలగలిపిన విజయవాడ (Vijayawada) నగరంలో ఈ ఏడాది జరిగే దసరా ఉత్సవాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి అలంకార దర్శనాలు మరింత గొప్పగా నిలిపేలా విజయవాడ ఉత్సవ్ పేరిట వినూత్న కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (MP Keshineni Shivnath) శ్రీకారం చుట్టారు. ప్రజలందరికీ ఒకే వేదికపై సాంస్కృతిక ఉత్సాహం, వినోదం, సంప్రదాయం, ఆధునికత అన్న నినాదంతో ప్రారంభమైన ఈ మహోత్సవం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు పది రోజులపాటు ఘనంగా నిర్వహించడానికి ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో ఉత్సవ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
నగరం నలుమూలల వేదికలు..
ఒకే నగరం ఒకే సంబరం అనే నినాదంతో ప్రభుత్వ సహకారం, వైబ్రేట్ విజయవాడ సొసైటీ (Vibrate Vijayawada Society), ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ఎంపీ కేశినేని శివనాథ్ రూపకల్పన చేసిన విజయవాడ ఉత్సవ్ ఈ ఏడాది దసరా ఉత్సవాలకు మరింత శోభను తీసుకురానుంది. ఈ ఉత్సవాలలో భాగంగా నగరం నలుమూలలా వేదికలు సిద్ధమవుతున్నాయి. పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కలాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, ఎంజీ రోడ్, విజయవాడ ప్రదర్శన స్థలం.. ఇలా ప్రతీచోటా వేర్వేరు అనుభూతులు కలిగించే ప్రదర్శనలు, గానవిందులు, నృత్యాలు, జానపద కళలు, ప్రజా క్రీడలు నగర వాసులతోపాటు, భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదకరం పంచనున్నాయి.
సంగీతం,నృత్యం,కళల వైభవం…
విజయవాడ ఉత్సవ్ లో భాగంగా పున్నమి ఘాట్ (Poonami Ghat) వద్ద చంద్రకాంతి కచేరీ నుండి కర్నాటక గానసాంప్రదాయం వరకూ పది రోజుల పాటు సంగీత సంబరం. అభిజిత్ నాయర్, మాధురి, కామాక్షి, అభిలిప్సా, సందీప్ నారాయణ్, కారుణ్య వంటి ప్రముఖుల గానవిందులు భక్తులను, శ్రోతలను అలరించనున్నాయి.
తుమ్మలపల్లి కళాక్షేత్రం (Tummalapalle Art Centre), ఘంటసాల సంగీత కళాశాల వద్ద ఈ ఉత్సవంలో అతి ముఖ్యమైన ఘట్టాలు తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల సంగీత కళాశాల వద్ద సంప్రదాయానికి ఊతమిచ్చే ప్రదర్శనలు జరగనున్నాయి. వాటిలో సంప్రదాయ నృత్యాలు, భక్తి సంగీత కచేరీలు, జానపద నాటకాలు, బుర్రకథలు, పద్య నాటకాలు, పౌరాణిక నాటకాలు ఈ వేదికలు తెలుగు సంస్కృతికి జీవం పోసేలా ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఉత్సవ్ కమిటీ సభ్యులు సిద్ధం చేశారు.

సంగీత ప్రియుల కోసం…
సంగీత ప్రియులను ఉర్రూ తొలగించేందుకు సంగీత మాస్ట్రోలు మణిశర్మ, ఆర్.పీ. పాట్నాయక్, కార్తిక్, గీతా మాధురి (Mani Sharma, R.P. Patnaik, Karthik, Geetha Madhuri) గానామృతాన్ని విజయవాడ వేదికగా అందించనున్నారు. ఇక విజయవాడ కిరీటం (మహిళలు, పురుషులు), విజయవాడ అవార్డులు, విజయవాడ మహిళా శక్తి సత్కారం వంటి ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.
వినోదం – ఆకర్షణలు..
ఈ ఉత్సవం కేవలం సంగీతం, నృత్యం వరకే పరిమితం కాకుండా కుటుంబాలందరికీ వినోదం అందించేలా విజయవాడ ఎంపీ (Vijayawada MP) కేశినేని శివనాథ్ రూపుదిద్దారు. గొల్లపూడి సమీపంలోని సువిశాలమైన మైదానంలో చేపట్టిన ఎగ్జిబిషన్ పనులు తుది దశకు చేరుకోగా ఇక్కడ వినోదం ఆహ్లాదంతో పాటు మరెన్నో వైవిధ్య కార్యక్రమాలు జరగనున్నాయి.
భక్తులకు కన్నుల పండుగ…
ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం అమ్మవారి ప్రత్యేక దర్శనం, నీటి క్రీడలు, డ్రోన్ ప్రదర్శనలు, ఆకాశ దీపావళి, హెలికాప్టర్ విహారం, మహా ఊరేగింపు, పిల్లలకు వినోద పార్కులు, ఆటవిడుపు కేంద్రాలు, ఆహార ప్రదర్శనలు, పందిళ్లు, ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక అనుభవం కలిగేలా అన్ని రంగాలూ కలగలిపి ఈ మహోత్సవం రూపుదిద్దుకుంది.

ప్రత్యేక సత్కారాలు – ప్రజల గౌరవం…
యువతలో ప్రతిభను వెలికి తీసేందుకు మహిళలు పురుషులకు వేరువేరుగా విజయవాడ కిరీటం, విజయవాడ కీర్తి అవార్డులు (Vijayawada Keerthy Awards), విజయవాడ మహిళా శక్తి సత్కారం విజయవాడ గానం, ఒంటి కార్యక్రమాలు కార్యక్రమాలు జరిగే ఈ వేదిక ప్రజల హృదయాలను గెలుచుకోనుంది. సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తూ గౌరవిస్తూ ఈ ఉత్సవ్ మరింత శోభను తీసుకురానుంది.
ప్రజా పండుగకు రూపకర్త…
ప్రజలు ఆనందంగా ఉండాలి, సంస్కృతిని కాపాడుకోవాలి, ఆధునికతతో సమానంగా సంప్రదాయాన్ని కొనసాగించాలి” – అనే ఆలోచనతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఈ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. ఆయన కృషితో విజయవాడ నగరం భక్తి, భోగం, సాంస్కృతిక వైభవం అన్నీ కలిసిన ఒక ఉత్సవ నగరంగా పండుగ శోభను సంతరించుకుంది. మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త అందచందాలు, వైవిద్యభర వినోదం వంటి కార్యక్రమాలు ఉండనున్నాయి.
విజయవాడకు గర్వకారణం…
ఈ దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవం (Vijayawada Festival) కేవలం రాష్ట్రానికే కాకుండా దేశమంతటికీ ఒక గర్వకారణం కానుంది. సంగీతం, నృత్యం, జానపదం, భక్తి, వినోదం అన్నీ కలిసిన ఈ మహోత్సవం ప్రపంచంలోనే అతి పెద్ద సాంస్కృతిక పండుగగా నిలిచే అవకాశం ఉంది. మైసూర్ ఉత్సవను మించేలా అన్ని కార్యక్రమాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.
ఎంపీ కేశినేని శివనాథ్ కు సీఎం చంద్రబాబు కితాబు…
విజయవాడ ఉత్సవ్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి (CM Nara Chandrababu Naidu) ని ఆహ్వానించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రజా ప్రతినిధులు, కమిటీ సభ్యులు శుక్రవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ ఉత్సవ్ ఆహ్వాన పత్రికను అందజేసిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు కమిటీ సభ్యుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. గతంలో వెలుగులు విరజిమ్మిన విజయవాడ నగరం .. గత వైఎస్ఆర్సిపి పాలకుల నిర్వాహకంతో చీకట్లో అలుముకున్నాయని, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శ్రీకారం చుట్టిన విజయవాడ ఉత్సవ్ తో నగరంలో వెలుగులు నింపుతుందని సీఎం చంద్రబాబు కితాబు ఇవ్వడం ఈ ఉత్సవాల ప్రాముఖ్యతను చాటి చెబుతోంది.

