మరమ్మతులు చేపట్టాలి..

భారీ వర్షాలకు కూలిన మంగళగిరి ఆలయ ప్రాకారం
అవసరమైన మరమ్మతులు చేపట్టాలి..
భక్తుల భద్రతకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి..

మంగళగిరి, నవంబరు 4:( ఆంధ్రప్రభ): భారీ వర్షాలకు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రాకారం కూలిన ప్రాంతాన్ని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూలిన ప్రాకారం వద్ద పరిస్థితులను, పేరుకుపోయిన శిథిలాలను పరిశీలించి ఆలయ భద్రతకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రమాదకర ప్రాంతంలో భక్తులు, సిబ్బంది సంచరించకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కూలిన ప్రాకారం శిథిలాలను సురక్షితంగా తొలగించాలని సూచించారు. మిగిలిన ప్రహరీ గోడ పటిష్టతను సాంకేతిక నిపుణులతో పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు. భక్తుల భద్రతకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.