ప్రజాదర్బార్‌కు వెల్లువెత్తిన వినతులు..

అక్కడికక్కడే కొన్ని సమస్యల పరిష్కారం
మరికొన్నింటిపై అధికారులకు ఆదేశాలు.. ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరు, ఆంధ్రప్రభ: సమస్యల రహిత నియోజకవర్గంగా ఏలూరును తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా శుక్రవారం పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు ఇప్పించాలని పలువురు కోరగా.. మరికొందరు ఇతర సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే కొన్ని వాటిని అక్కడికక్కడే పరిష్కరించగా, మరికొన్నింటిపై సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వాధినేతల పిలుపు మేరకు ప్రజాదర్బార్‌ను నియోజకవర్గంలో నిరంతరం కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించడంతో పాటు పేదలకు ఆర్థికంగా అండగా నిలిచే కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. సొంత ఇంటి స్థలం ఉన్నవారికి రుణ సదుపాయం కల్పించి ఇళ్ల నిర్మాణానికి సహకరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

పెన్షన్లు, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం అందేలా పారదర్శకంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఏలూరును ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, పార్టీ నాయకులు బెల్లపుకొండ కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.