Olympics 2036 ఆతిథ్యంపై హోరాహోరీ.. భారత్‌ సహా ఏడు దేశాల పోటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌: ఒలింపిక్స్‌ నిర్వహించాలన్న భారత కలకు మరో కీలక అడుగు పడింది. 2036 సమ్మర్‌ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని ప్రయత్నిస్తున్న దేశాల్లో భారత్‌ కూడా ఉన్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) వెల్లడించింది. భారత్‌తో పాటు జర్మనీ, ఖతార్‌, హంగేరీ, టర్కియే, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా.. మొత్తం ఏడు దేశాలు ప్రస్తుతం ఐఓసీతో ప్రాథమిక చర్చల దశలో ఉన్నాయి.

భారత్‌ లక్ష్యం ఇదే..

భారత్‌ ఇప్పటివరకు ఒలింపిక్‌ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వలేదు. ఈసారి ఆ అవకాశాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. భారత ప్రతిపాదనలో అహ్మదాబాద్‌ కీలక కేంద్రంగా ఉండనుంది. అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదికలు, మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ, వసతి సౌకర్యాలను బిడ్‌లో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఒలింపిక్స్‌ వంటి ప్రపంచస్థాయి ఈవెంట్‌ నిర్వహణ ద్వారా భారత్‌కు క్రీడలతో పాటు పర్యాటకం, మౌలిక వసతులు, ఉపాధి రంగాల్లోనూ దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.

పోటీలో ఎవరెవరు ఉన్నారంటే..

2036 ఒలింపిక్స్‌ కోసం ప్రస్తుతం బరిలో ఉన్న ఏడు దేశాల్లో భారత్‌ మాత్రమే తొలిసారి ఆతిథ్యం కోసం ప్రయత్నిస్తున్న దేశం కాదు. జర్మనీ, హంగేరీ, టర్కియే గతంలోనూ ఒలింపిక్‌ బిడ్‌లను ప్రయత్నించాయి. దక్షిణ కొరియా ఇప్పటికే వేసవి, శీతాకాల ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. దక్షిణాఫ్రికా తొలిసారి ఆఫ్రికా ఖండంలో ఒలింపిక్స్‌ నిర్వహించాలనే లక్ష్యంతో ముందుకొచ్చింది. ఖతార్‌ 2022 ఫిఫా ప్రపంచకప్‌ నిర్వహించిన అనుభవంతో బరిలో ఉంది.

2036 ఒలింపిక్స్‌ ఆతిథ్యం విషయంలో ఇప్పుడే తుది పోటీ మొదలైనట్లు కాదు. ప్రస్తుతం దేశాల ప్రతిపాదనలను పరిశీలించే ప్రక్రియ కొనసాగుతోంది. 2027 మార్చిలో తదుపరి దశకు వెళ్లే దేశాలను షార్ట్‌లిస్ట్‌ చేయనున్నారు. ఆ తర్వాత మరింత విస్తృతమైన వ్యూహాత్మక చర్చలు జరుగుతాయి. 2028లో ప్రాధాన్య ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసే ప్రక్రియ ఉండగా.. 2036 ఒలింపిక్స్‌ ఎక్కడ జరుగుతాయన్న తుది నిర్ణయం 2029 మధ్య నాటికి వెలువడే అవకాశం ఉంది. కొత్త బిడ్‌లకు అక్టోబర్‌ 31, 2026 వరకు అవకాశం ఉంది.

ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసే క్రమంలో కేవలం భారీ స్టేడియాలు, మౌలిక వసతులకే కాకుండా క్రీడాకారులకు అందే అనుభవానికీ ప్రాధాన్యం ఇవ్వాలని ఐఓసీ స్పష్టం చేస్తోంది. కొత్త విధానంలో అథ్లెట్ల అవసరాలు, గేమ్స్‌ నిర్వహణ సామర్థ్యం, భవిష్యత్‌ ప్రయోజనాలు వంటి అంశాలను కూడా పరిశీలించనున్నారు.

భారత్‌ కల నెరవేరుతుందా?

ప్రస్తుతం ఇది ఆతిథ్య దేశంగా ఎంపిక కావడం కాదు.. అవకాశం కోసం భారత్‌ అధికారిక ప్రక్రియలో ముందుకు సాగుతున్న దశ మాత్రమే. 2027 షార్ట్‌లిస్ట్‌, ఆ తర్వాతి వ్యూహాత్మక చర్చలు, చివరకు 2029లో జరిగే తుది ఎంపికతోనే భారత్‌ కలకు స్పష్టత రానుంది.ఇప్పటికే 2028 ఒలింపిక్స్‌కు లాస్‌ ఏంజెల్స్‌, 2032 క్రీడలకు బ్రిస్బేన్‌ వేదికలు ఖరారయ్యాయి. ఇప్పుడు ప్రపంచ క్రీడాభిమానుల చూపు 2036పై పడింది.