పదేళ్లు గడిచినా మారని కార్యాలయ బోర్డు
పశుసంవర్ధక శాఖలో అధికారుల నిర్లక్ష్యం?
ఆర్టీఐ నిబంధనల అమలుపైనా పట్టింపులేదా?
కొత్తగూడెం, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆనవాళ్లు ఇంకా కనిపిస్తుండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని విద్యానగర్ కాలనీలో కొనసాగుతున్న పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం వద్ద ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన పాత బోర్డు దర్శనమిస్తోంది. జిల్లాల పునర్విభజన జరిగి ఇంతకాలం గడిచినా కార్యాలయ బోర్డుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరును సూచించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సహాయ సంచాలకుల కార్యాలయం భవనం మొదటి అంతస్తులో కొనసాగుతుండగా, కింది భాగంలో పశువుల ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అయితే ఆసుపత్రికి ప్రత్యేక బోర్డు లేకపోవడంతో పాటు ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించే విధంగా వివరాలు ప్రదర్శించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని స్థానికులు అంటున్నారు. సమాచార హక్కు చట్టం–2005కు సంబంధించిన అప్పిలేట్ అధికారి, సహాయ అప్పిలేట్ అధికారి పేర్లు, నోటీస్ బోర్డు, కార్యాలయ సిబ్బంది వివరాలు తదితర కీలక సమాచారాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచలేదని పేర్కొంటున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందాల్సిన సమాచారాన్ని స్పష్టంగా ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పేరుతో నూతన బోర్డు ఏర్పాటు చేయాలని, పశువుల ఆసుపత్రికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆర్టీఐ చట్టానికి సంబంధించిన అధికారుల వివరాలు, నోటీస్ బోర్డు, సిబ్బంది వివరాలను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని కోరుతున్నారు.
