జిల్లా కలెక్టరేట్లో పనిచేయని లిఫ్ట్..

పట్టించుకోని అధికారులు..

వికారాబాద్ అక్టోబర్ 7 (ఆంధ్రప్రభ): వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయంలో లిఫ్ట్ సేవలు నిలిచిపోవడంతో అక్కడకు వచ్చే సామాన్య ప్రజలతో పాటు అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన ద్వారం వద్ద ఉన్న లిఫ్ట్ తరచూ సాంకేతిక సమస్యలతో మొరాయిస్తుండటంతో మొదటి, రెండవ అంతస్తులకు వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మెట్ల దారే శరణ్యం

కలెక్టరేట్ ఆవరణలో మొత్తం రెండు లిఫ్టులు ఉండగా, ఒకటి కలెక్టర్ ఛాంబర్ వద్ద, మరొకటి సాధారణ ప్రజల రాకపోకల కోసం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేశారు. ప్రజల కోసం కేటాయించిన ఈ లిఫ్ట్ సక్రమంగా పనిచేయకపోవడంతో వివిధ పనుల నిమిత్తం పై అంతస్తులలోని కార్యాలయాలకు వెళ్లే వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు మరియు ఉద్యోగులు మెట్లు ఎక్కి వెళ్లాల్సి వస్తోంది.

అధికారుల ఉదాసీనతపై అసహనం

లిఫ్ట్ తరచూ పనిచేయకుండా నిలిచిపోతున్నప్పటికీ సంబంధిత అధికారులు దాని మరమ్మతులపై శ్రద్ధ చూపడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి నిలిచిపోయిన లిఫ్ట్‌ను బాగుచేయించి, రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని వికారాబాద్ ప్రజలు కోరుతున్నారు.