అర్నబ్ తుపాన్.. అధికారుల విస్కృత పర్యటన

చింతూరు, ఆంధ్రప్రభ: అర్నబ్ తుపాను నేపథ్యంలో చింతూరు ఐటీడీఏ పీవో చిట్టపలి నరేంద్ర కుమార్, పోలవరం అడ్మిన్ ఓఎస్డీ జావళి ఆల్ఫోన్స్, చింతూరు ఎస్డీపీవో ఉదయ పావనిలు గురువారం డివిజన్‌లో క్షేత్రస్థాయిలో విస్కృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా లోతట్టు, ప్రమాదకర ప్రాంతాలు, రహదారులు, విద్యుత్ సరఫరా పరిస్థితులను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ పర్యటనలో భాగంగా మోతుగూడెం ప్రాంతంతో పాటు నేలకోట, కొత్తపల్లి, దేవరపల్లి తదితర ప్రాంతాలను సందర్శించి, తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో రహదారుల పరిస్థితులు, విద్యుత్ కనెక్టివిటీ, రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులు, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అలాగే పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని తులసిపాక సోకిలేరు వ్యూ పాయింట్‌లను కూడా సందర్శించారు. వర్షాల నేపథ్యంలో పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో చింతూరు సీఐ గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.