Odisha Encounter | పుల్లెంల చేరుకున్న మావోయిస్టు గణేశ్ మృతదేహం

Odisha Encounter | పుల్లెంల చేరుకున్న మావోయిస్టు గణేశ్ మృతదేహం
- సాయంత్రం అంత్యక్రియలు
- గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటును అడ్డుకున్న పోలీసులు
Odisha Encounter | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : ఒడిశా ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేష్ మృతదేహం ఆదివారం మధ్యాహ్నం స్వగ్రామమైన నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చేరుకుంది. మావోయిస్టు (Maoist) ఉద్యమంలో పని చేసి కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగిన పాక హనుమంతు గ్రామాన్ని విడిచి నాలుగు దశాబ్దాలు దాటింది. నిన్న ఒడిశా వెళ్లి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్నిస్వాధీనం చేసుకున్నకుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకొచ్చారు. పాక హనుమంతు మృతదేహాన్ని చూడడానికి గ్రామస్తులు అశ్రునయనాలతో వేచి చూశారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఉద్యమంలో చేరిన నాటి నుండి తల్లిదండ్రులు చనిపోయినా హనుమంతు స్వగ్రామానికి రాలేదు.

దీంతో హనుమంతు ఎలా ఉన్నాడో చూడాలన్న ఆత్రుత గ్రామస్తుల తో పాటు అందరిలో కనిపించింది. ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాక హనుమంతు (Paka Hanumanthu) మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాక హనుమంతు కాలేజీ చదువుల్లో తనకు జూనియర్ విద్యార్థి అని చెప్పారు. పేద, పీడిత వర్గాల హక్కుల కోసం పోరాడిన హనుమంతు మరణం బాధాకరమన్నారు. కాగా హనుమంతు మృతి సందర్భంగా గ్రామంలో ఆయన కుటుంబ సభ్యులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
