మాడ్ మధిర సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ విజయవంతం

  • 11 మండలాల్లో 27,700 మంది విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాహార అల్పాహారం

మధిర, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా మధిరలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ విజయవంతంగా కొనసాగుతుంది. మధిరలో ఏర్పాటుచేసిన కిచెన్ను 2026 జూలై 27న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఆయన మార్గదర్శకత్వం, పర్యవేక్షణ, సహకారంతో ఈ కార్యక్రమం గత రెండు నెలలుగా విజయవంతంగా కొనసాగుతోంది.

మధిర సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ పరిధిలోని మధిర, ఎర్రుపాలెం, తల్లాడ, వైరా, కొణిజర్ల, వేంసూరు పెనుబల్లి, బోనకల్, కల్లూరు, చింతకాని, ముదిగొండ మండలాల్లోని 575 ప్రభుత్వ పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న సుమారు 27,700 మంది విద్యార్థులకు ప్రతిరోజూ రుచికరమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

విద్యార్థులకు సమతుల్యమైన పోషకాహారం అందించేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సహకారంతో అల్పాహార మెనూను రూపొందించారు. వారంలో వివిధ రకాల అల్పాహారాన్ని అందించడంతో పాటు, రోజు విడిచి రోజు వేడి పాలను కూడా అందిస్తున్నారు.

వారపు అల్పాహార మెనూ

మొదటిరోజు: ఇడ్లీ – సాంబార్

రెండో రోజు: పూరి – ఆలూ కుర్మా

మూడోరోజు: దోశ – చట్నీ

నాలుగవ రోజు: ఉప్మా – చట్నీ

ఐదో రోజు: మిల్లెట్ ఇడ్లీ – సాంబార్

ఆరో రోజు: బోండా – చట్నీ

కేంద్రీకృత వంటశాలలో ఆధునిక పద్ధతులు, పరిశుభ్రమైన వంట విధానాలను అనుసరిస్తూ పెద్ద సంఖ్యలో విద్యార్థులకు అవసరమైన అల్పాహారాన్ని సమయానికి సిద్ధం చేస్తున్నారు. ఈ కిచెన్‌లో గంటకు 5,400 ఇడ్లీలు, 3,600 పూరీలు, 2,000 దోశలు తయారు చేసే సామర్థ్యం ఉంది. అనంతరం ప్రత్యేక వాహనాల ద్వారా ఆయా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు అల్పాహారాన్ని సకాలంలో పంపిణీ చేస్తున్నారు.

ప్రభుత్వం అందించే ధరలు

ప్రాథమిక పాఠశాల (1–5 తరగతులు) విద్యార్థికి బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.11.50, ఉన్నత పాఠశాల (6–10 తరగతులు) విద్యార్థికి రూ.13.50, జూనియర్ కళాశాల విద్యార్థికి బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.13.50గా ప్రభుత్వం అందిస్తోంది.పాలకు రూ.1.08 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది.

ఉదయం పూట పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా విద్యార్థులు ఆకలితో పాఠశాలకు రాకుండా చూడటం, వారి ఆరోగ్యం, ఏకాగ్రత, పాఠశాల హాజరు మెరుగుపడేలా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

ఈ వంటశాల నిర్మాణానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఉదారంగా నిధులు అందించి, కార్యక్రమానికి సహకరించిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.