మీసేవ కేంద్రాల సంఖ్య పెంచాలి..

మంత్రి శ్రీధర్‌బాబుకు బీఆర్‌ఎస్‌ నాయకుల వినతి

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా ఇన్‌చార్జ్‌, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును బీఆర్‌ఎస్‌ మేడ్చల్‌ మాజీ కౌన్సిలర్‌ ఉమా నాగరాజ్‌ ముదిరాజ్‌ మంగళవారం ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రాంతీయ అవసరాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం సమర్పించారు. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 297, 298, 299 డివిజన్లతో పాటు ఎల్లంపేట్‌ మున్సిపాలిటీలో జనాభా వేగంగా పెరుగుతోందని ఉమా నాగరాజ్‌ తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ సేవలను అందించేందుకు మీసేవ కేంద్రాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జనాభా ప్రాతిపదికన ఆయా ప్రాంతాల్లో కొత్తగా ప్రభుత్వ మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా, సులభంగా అందుబాటులోకి రావాలంటే అదనపు మీసేవ కేంద్రాల ఏర్పాటు అవసరమని వివరించారు.