Only Organic Farm ప్రకృతి సాగుతోనే Andhra Prabha News..

Only Organic Farm ప్రకృతి సాగుతోనే Andhra Prabha News..
ఆరోగ్య సిరులు…
రైతులకు సుస్థిర ఆదాయం,
సమాజానికి మెండైన ఆరోగ్యం.
ప్రపంచ మనుగడకు ఏకైక మార్గం సేంద్రియ సేద్యం
విజయవంతంగా ఎన్టీఆర్ జిల్లా ఆర్గానిక్ రైతు ఉత్సవం-2026..
పండగలా సాగిన రెండో రోజు సేంద్రియ మేళా.
( ఆంధ్రప్రభ విజయవాడ)
Only Organic Farm | నేల ఆరోగ్యం.. రైతు శ్రేయస్సు.. సమాజ శ్రేయస్సుకు, భావితరాల బంగారు భవిష్యత్తుకు కీలక మార్గమైన ప్రకృతి సేద్యం, ఆర్గానిక్ ఉత్పత్తులపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించి సేంద్రియ సాగును ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్‌టీఆర్ జిల్లా యంత్రాంగం, రైతు సాధికార సంస్థ, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, శ్రేయాస్ ఫార్మర్స్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో ఆదివారం జరిగిన రెండో రోజు ఎన్‌టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవ్ విజయవంతమైంది. కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, ఔత్సాహిక రైతులు.. ఇలా ప్రతిఒక్కరూ ప్రకృతిసాగును ముందుకు తీసుకెళ్లడంలో తమవంతు భాగస్వామ్యం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

దేశీయ గో ఉత్పత్తుల కేంద్రం, రైతు సాధికార సంస్థ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, బయో ఇన్‌పుట్స్, పీఆర్ఐటీహెచ్‌యూ (రీజెన్ అగ్రి కార్బన్ ప్రాజెక్టు), వన్ ఎర్త్ – వన్ లైఫ్ టెర్రాస్ గార్డెన్, సాయిశ్రీనివాస్ గోశాల, స్వయం సహాయక సంఘాల ఆర్గానిక్ ఉత్పత్తులు, దేశవాళీ వంగడాలు, ఆరోగ్య వనం తదితర స్టాళ్లు ఏర్పాటు చేసి ఆర్గానిక్ సాగుతో పాటు ఉత్పత్తుల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ప్రబాల్ తోమర్ (కిసాన్ లెడ్జర్), ఆశా కిరణ్ (అమరావతి ఆర్గానిక్), రఘురాం (భూమి ఆర్గానిక్) తదితర ప్రకృతి సేద్యం, ఉత్పత్తుల రంగ నిపుణులు మార్కెట్ లింకేజీలపై అవగాహన కల్పించారు. రైతులు తాము పండించిన ప్రకృతి సేద్య ఉత్పత్తులకు మంచి ధర లభించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వినియోగదారుడు కూడా తనకు నాణ్యమైన ప్రకృతి సేద్య ఉత్పత్తులే కొనుగోలు చేశాననే విశ్వాసం పెంపొందించేలా తీసుకొచ్చిన ట్రేసబులిటీపై కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. క్యూఆర్ కోడ్‌తో విత్తు నుంచి విక్రయం వరకు ప్రతి సమాచారాన్ని తెలుసుకునే విధానంపై మాట్లాడారు.
Only Organic Farm | ఆర్గానిక్ రైతోత్సవం వినూత్నం,

ఆర్గానిక్ రైతోత్సవం – నేచురల్ ఫార్మింగ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా ఆర్గానిక్ రైతోత్సవం ఓ వినూత్న విజ్ఞానదాయక కార్యక్రమమని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా జిల్లాలో ప్రకృతి సేద్యంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ప్రతి మండలంలోనూ కేశినేని ఫౌండేషన్ ద్వారా సేంద్రియ వ్యవసాయంపై సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు. ఒక్కో మండలంలో మూడు రోజుల పాటు జరిగే సదస్సులో నిపుణుల భాగస్వామ్యంతో ప్రకృతి సేద్యంలో అత్యుత్తమ విధానాల (బెస్ట్ ప్రాక్టీసెస్)పై అవగాహన కల్పిస్తామన్నారు. 225 రోజుల పాటు ఈ సదస్సుల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. సేంద్రియ ఉత్పత్తులపై మన స్వయం సహాయక సంఘాల మహిళలకు హైదరాబాద్‌లోని ఎన్ఐఆర్‌డీలో శిక్షణ ఇప్పించామన్నారు. జిల్లాలో 100 శాతం ప్రకృతి వ్యవసాయం జరిగేలా చేసి.. దేశానికే ఆదర్శవంతంగా నిలిచేలా కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ సారథ్యంలో జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో మిద్దె పంటలను కూడా ప్రోత్సహిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
Only Organic Farm | అన్నదాతకు వినియోగదారుడికి మధ్య…

రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ శావల దేవదత్ మాట్లాడుతూ అన్నదాతలకు, వినియోగదారులకు మధ్య వంతెనగా ప్రభుత్వం సేవలందిస్తోందని.. ప్రకృతి సేద్యంపై అపోహలు తొలగించి రైతులకు మంచి ఆదాయాలు వచ్చేలా, వినియోగదారులకు నాణ్యమైన ప్రకృతి ఉత్పత్తులు లభించేలా సర్టిఫికేషన్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పండించే పంట మీద నమ్మకం కల్పించేందుకు.. అంతర్జాతీయ మార్కెట్లో సైతం విక్రయాలు జరిపేలా ఈ సర్టిఫికేషన్ ఉపయోగపడుతుందన్నారు.
Only Organic Farm | దార్శినిక నేత సీఎం…
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ దార్శనిక సీఎం 2014లో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (జెడ్‌బీఎన్ఎఫ్)ను మన ముందుకు తెచ్చారని, ఆయన దార్శనికతకు అనుగుణంగా సేంద్రియ సాగును సమష్టి కృషితో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో 107 వ్యర్థాల శుద్ధి కేంద్రాలను పెడుతున్నామని.. వీటిద్వారా రోజుకు 1,500 మెట్రిక్ టన్నుల సేంద్రియ ఎరువులను అందుబాటులోకి తెచ్చి.. మార్క్‌ఫెడ్ ద్వారా రైతులకు అతి తక్కువ ధరకే అందిస్తామని వెల్లడించారు.
Only Organic Farm | స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యంగా….
20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు ప్రకృతి సేద్యం కూడా కీలక అంశమని పేర్కొన్నారు. ఆరోగ్య ఆంధ్ర సాకారానికి ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులు అవసరమని… ఇందుకు ప్రకృతి సేద్యం ముఖ్యమన్నారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలోనూ ప్రకృతి వ్యవసాయానికి కేటాయింపులు చేయడం జరిగిందన్నారు. అరకు, పాడేరు, పార్వతీపురం వంటి ప్రాంతాల్లోనూ ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యమిస్తున్నారని.. ఇదే తరహాల్లో రాష్ట్రం అంతటా ఈ సాగును అవలంబించేలా ప్రోత్సహిస్తున్నట్లు లంకా దినకర్ వివరించారు. గౌరవ పీఎం, గౌరవ సీఎం ఆదర్శాలను సమష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఆర్గానిక్ మేళాలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్‌రావు, జెడ్‌పీ మాజీ ఛైర్‌పర్సన్ గద్దె అనూరాధ.. ప్రకృతి వ్యవసాయంతో సమాజానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. సాంకేతికత సహాయంతో ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాగంగా ప్రకృతిసేద్యాన్ని అనుసరిస్తూ పది మందికీ ఆదర్శవంతంగా నిలుస్తున్న రైతులు, అతిథులను సత్కరించారు.

కార్యక్రమంలో ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్ష్ట్రక్షన్ వర్కర్స్స్ అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్ జి.రఘురామరాజు,
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీపీఎం వై.శంకర్ నాయక్, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయ కుమారి, ఏపీ ఛాంబర్స్ ప్రెసిడెంట్ పి.భాస్కర్ రావు, ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్‌వీ స్వామి, రమణ (విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్), రచయిత కలిమిశ్రీ తదితరులతో పాటు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, హోటల్స్ అసోసియేషన్స్ తదితరాల ప్రతినిధులు, పెద్దఎత్తున ప్రకృతిసేద్య ఔత్సాహికులు పాల్గొన్నారు
