పేదలు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యం
లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ
వినుకొండ, ఆంధ్రప్రభ : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో గురువారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పింఛన్ లబ్ధిదారులను స్వయంగా కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా కార్యక్రమాల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.
పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర అర్హులైన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని జీవీ పేర్కొన్నారు. ప్రజల వద్దకే వెళ్లి పింఛన్లు అందించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని తెలిపారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తమ నివాస ప్రాంతానికే వచ్చి పింఛన్ నగదు అందజేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
