పెన్షన్.. పేదల జీవితాలకు భరోసా

కూటమి ప్రభుత్వానికి సంక్షేమమే ప్రాధాన్యత

పెడన, ఆంధ్రప్రభ : పెడన మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో నిర్వహించిన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ కార్యక్రమంలో పెడన శాసనసభ్యుడు కాగిత కృష్ణ ప్రసాద్‌ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన లబ్ధిదారులతో ఎమ్మెల్యే ఆత్మీయంగా మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను విని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ ప్రతి నెలా అందించే ఆర్థిక సహాయం మాత్రమే కాదని, వృద్ధాప్యంలో ఉన్న వారికి జీవన భరోసాగా, వితంతువులకు అండగా, దివ్యాంగులకు ఆత్మవిశ్వాసంగా, పేద కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారుడు గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ భరోసా ఇదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.