NPDCL Electricity Assistance Teams to Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్‌కు ఎన్పీడీసీఎల్‌ సహాయక బృందాలు

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణకు 640 మంది సిబ్బంది
78 బృందాలు అమలాపురానికి తరలింపు

NPDCL Electricity Assistance Teams to Andhra Pradesh | ఉమ్మడి వరంగల్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి: తుఫాన్‌ ప్రభావంతో విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సహకారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు తెలంగాణ ఉత్తర మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్‌) సిబ్బందితో కూడిన సహాయక బృందాలను ఆంధ్రప్రదేశ్‌కు పంపించింది.

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ వ్యవస్థకు జరిగిన నష్టం, సరఫరా పునరుద్ధరణకు అవసరమైన సహాయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో చర్చించిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్‌ సహాయక బృందాలను పంపించాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, టీజీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ జితేష్‌ వి. పాటిల్‌, టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డిలు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా హనుమకొండలోని నక్కలగుట్ట ప్రధాన కార్యాలయం నుంచి ఎన్పీడీసీఎల్‌ పరిధికి చెందిన 78 బృందాల్లోని 640 మంది విద్యుత్‌ సిబ్బంది గురువారం అమలాపురానికి బయలుదేరి వెళ్లారు.

తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న విద్యుత్‌ లైన్లు, స్తంభాలు, ఇతర విద్యుత్‌ మౌలిక సదుపాయాలకు మరమ్మతులు చేపట్టడం ఈ బృందాల ప్రధాన లక్ష్యం. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించేందుకు సిబ్బంది సహకరించనున్నారు.

తొమ్మిది జిల్లాల్లో విద్యుత్‌ వ్యవస్థకు నష్టం

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తుఫాన్‌ ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లినట్లు చంద్రబాబు నాయుడు వివరించారు. పంటలకు నష్టం కలగడంతో పాటు విద్యుత్‌ వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం 16 వేలకు పైగా విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయని, వందలాది గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు అదనపు సిబ్బంది, సాంకేతిక సహకారం అవసరమైంది.

తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకురావడంలో తెలంగాణ నుంచి వెళ్లిన సహాయక బృందాలు కీలక పాత్ర పోషించనున్నాయి. దెబ్బతిన్న లైన్లు, స్తంభాల మరమ్మతులతో పాటు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనుల్లో ఈ బృందాలు పాల్గొననున్నాయి.