suprem| వయసు ఆధారంగా సంపూర్ణ ఆంక్షలు సరికాదు

వయసు ఆధారంగా సంపూర్ణ ఆంక్షలు సరికాదు

  • భద్రత, స్వేచ్ఛ రెండూ ముఖ్యమే
  • ఆన్‌లైన్‌ వేధింపులపై కఠిన చర్యలు అవసరం
  • హానికర కంటెంట్‌ తొలగింపునకు వేగవంతమైన చర్యలు
  • సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : పిల్లలు ఇంటర్నెట్‌ను వినియోగించకుండా వయసు ఆధారంగా సంపూర్ణ ఆంక్షలు విధించాలనే ఆలోచనను సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. ఇంటర్నెట్‌ను పొందడం, వినియోగించడం పిల్లల ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశమని పేర్కొంది. ఆన్‌లైన్‌లో పిల్లలను రక్షించడం, వారి స్వేచ్ఛను గౌరవించడం పరస్పర విరుద్ధమైన లక్ష్యాలుగా చూడకూడదని స్పష్టం చేసింది. పిల్లలు ఇంటర్నెట్‌కు పూర్తిగా దూరమయ్యేలా చేయడం కంటే, ఆన్‌లైన్‌ ప్రమాదాలను తగ్గించే రక్షణ చర్యలు చేపడుతూ వారు ఇంటర్నెట్‌ను వినియోగించుకునేలా చూడాలని కోర్టు అభిప్రాయపడింది.

కఠిన ఆంక్షలతో కొత్త సమస్యలు

వయసు ఆధారంగా కఠినమైన ఆంక్షలు విధిస్తే అనుకోని పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని కోర్టు పేర్కొంది. ప్రధాన డిజిటల్‌ వేదికలను వినియోగించకుండా అడ్డుకున్న పిల్లలు, సరైన నియంత్రణ లేని వెబ్‌సైట్ల వైపు వెళ్లే అవకాశం ఉందని తెలిపింది. అలాంటి వేదికల్లో వారికి మరింత ప్రమాదం ఎదురుకావచ్చని అభిప్రాయపడింది. ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులు, బెదిరింపులు లేదా మోసపూరిత ప్రలోభాలకు గురైన పిల్లలు మరో సమస్యనూ ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొంది. ఇంటర్నెట్‌ ఆంక్షలను ఉల్లంఘించామనే భయంతో వారు తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించేందుకు లేదా సహాయం కోరేందుకు వెనుకాడవచ్చని తెలిపింది. మైనర్ల రక్షణ కోసం నిబంధనలు రూపొందించేటప్పుడు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

లైంగిక వేధింపుల కంటెంట్‌పై కఠిన చర్యలు

పిల్లల ఇంటర్నెట్‌ వినియోగంపై సంపూర్ణ నిషేధాలను సమర్థించకపోయినా, ఆన్‌లైన్‌ లైంగిక దోపిడీ నుంచి వారిని రక్షించేందుకు మరింత పటిష్ఠమైన వ్యవస్థ అవసరమని కోర్టు పేర్కొంది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను గుర్తించడం, డిజిటల్‌ వేదికల నుంచి వేగంగా తొలగించడం కీలకమని స్పష్టం చేసింది.

హక్కులకు భంగం కలగకుండా భద్రత

పిల్లల భద్రతను నిర్ధారించే చర్యలు వారి ప్రాథమిక హక్కులను హరించేలా ఉండకూడదని కోర్టు అభిప్రాయపడింది. ఆన్‌లైన్‌ వేధింపులపై ఫిర్యాదు చేసే వ్యవస్థలను మెరుగుపరచడం, హానికర కంటెంట్‌ను త్వరగా తొలగించడం, డిజిటల్‌ వేదికల్లో రక్షణ చర్యలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని సూచించింది.

పిల్లలకు ఇంటర్నెట్‌ వల్ల కలిగే ప్రయోజనాలు అందుబాటులో ఉండేలా చూస్తూనే, ఆన్‌లైన్‌ ప్రమాదాల నుంచి వారిని కాపాడే సమతుల్య నియంత్రణ వ్యవస్థ అవసరమనే అంశాన్ని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.