అదో లొట్టపీసు కేసు…

ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గం

హైదరాబాద్ : ఫార్ములా ఈ రేసు నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి లపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా విచార‌ణ పూర్తి చేసిన‌ ఏసీబీ.. త‌మ నివేదికను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించింది.

అయతే, ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి జ‌రిగిందంటూ ఏసీబీ త‌యారు చేసిన నివేదిక‌ను కేటీఆర్ ఖండించారు. సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఆయన “ప్రభుత్వానికి ధైర్యం ఉంటే నాకు, సీఎంకి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి. మీడియా ముందు లై డిటెక్టర్ టెస్ట్‌కి నేను సిద్ధంగా ఉన్నాను అని సవాల్ విసిరారు.

చార్జ్ షీట్ అనేది ప్రోసీజర్‌లో భాగమే. మొదటి నుంచే చెబుతున్నా, ఇది పూర్తిగా ఒక లొట్టపీసు కేసు అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రతిష్ట కోసం, హైదరాబాద్ ను ఎలక్ట్రిక్ వెహికిల్ (EV) రంగంలో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకే ఈవెంట్ నిర్వహించామన్నారు. హైదరాబాద్‌ ప్రతిష్ట పెరగాలి, తెలంగాణ ప్రతిష్ట పెరగాలి, మొబిలిటీ వ్యాలీ రావాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, EV రంగం అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతోనే రేసును నిర్వహించాం అన్నారు.

ప్రభుత్వం నుంచి 45 కోట్లు అధికారికంగా, బ్యాంకుల ద్వారానే చెల్లించాం. ఒక్క రూపాయి కూడా తారుమారు కాలేదు. ప్రతి రూపాయికి లెక్క ఉంది. అలాంటప్పుడు అవినీతి ఎక్కడ జరిగింది? అని ప్రశ్నించారు. ఇది పూర్తిగా ఒక లొట్టపీసు కేసు. నేను నిజాయితీగా ఉన్నా. అందుకే ధైర్యంగా లై డిటెక్టర్ టెస్ట్‌కి కూడా సిద్ధంగా ఉన్నా అని కేటీఆర్ అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన కేటీఆర్, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు అయ్యే వరకు మేము పోరాటం కొనసాగిస్తాం. విద్యార్థుల, రైతుల తరఫున పోరాడుతాం. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గం అని అన్నారు.

కాగా, ఏసీబీ ఇప్పటికే గవర్నర్‌ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ పంపింది. అనుమతి రాగానే నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply