ప్రాణాలతో చెలగాటం వద్దు : పులివెందుల జనం ఘోష
పులివెందుల అర్బన్, ఆంధ్రప్రభ : బుల్లి బైకర్ల విన్యాసాలు ప్రాణాంతకం.. ఎంతోమంది ప్రాణాలను బలికొంటున్నాయి. మద్యం మత్తులో ఒక యువకుడు ఒక ట్రావెల్ బస్సు (Travel bus) కింద పడి బస్సు నుంచి మంటలు చెలరేగడంతో ఎంతోమంది ప్రాణాలు గాలిలోకి కలిసిపోయే విషయం అందరికీ విధితమే. యుక్తవయసులో డ్రైవింగ్ విన్యాసాలు, తెలియనితనం వారితో పాటు ఇతర వాహనదారుల ప్రాణాల మీదకు తెస్తున్నారు.
అధిక వేగం, మద్యం సేవించి బైక్, ఇతర వాహనాలు నడపడం, నిబంధనల్ని బేఖాతరు చేయడం వంటి కారణాలతో మైనర్లు అర్ధాంతరంగా మృతి చెందుతున్నారు.తల్లిదండ్రులకు తీరని వేదన మిగుల్చుతున్నారు. మైనర్ బాలురుల(Minor Boys)కు వాహనాలు ఇస్తే ప్రమాదాలు సంభవిస్తాయని, పోలీసు ఉన్నతాధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రజల్లో మార్పు రావడం లేదు. మైనర్లు వాహనాలలో విన్యాసాలు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
అలాంటి సంఘటన వేంపల్లి పులివెందుల బైపాస్ రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. వేంపల్లిలోని గండి నుంచి పులివెందులకు వెళ్లే బైపాస్ రోడ్డు(Bypass Road)లో కొంతమంది మైనర్ బాలలు బైకులతో విన్యాసాలు చేస్తూ ఆ దారిన వెళ్లే వాహన చోదకులకు, ఇతరులను హడలెత్తించారు. అదే రహదారిలో వెళ్లే వాహనదారులు మందలిస్తే పోలీసులు కాకుంటే వాళ్ళ బాబులకు చెప్పుకోండి అని తిరిగి ఈ మైనర్లు చెప్పడం విడ్డూరంగా ఉంది. అలా వెళ్లేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు ఎంత బాధ పడాల్సి వస్తుందో తల్లిదండ్రులకే అర్థం కావాలని ప్రజలు అంటున్నారు.
జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్(Nachiket Vishwanath) ఆదేశాల మేరకు పులివెందుల డిఎస్పి మురళి నాయక్ మైనర్లకు వాహనాలు ఇస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాo అని హెచ్చరించిన మరుసటి రోజు వేంపల్లి లో హల్చల్ చేస్తున్న వీరికి అడ్డుకట్ట పోలీసులు వేస్తారో లేదో చూడాలి. సదరు మైనర్ బాలురు నడిపే వాహనాలకు ఎలాంటి నంబర్ ప్లేట్లు(Number Plates) కూడా లేకపోవడం విశేషం. ఇలాంటి బైకు విన్యాసాలు చేసేవారిపై, వారికి వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ప్రజలు కోరుతున్నారు.

