ఆలయాల పరిరక్షణకు పాటుపడాలి
బీజేపీ ఆధ్యాత్మిక సెల్ నూతన కమిటీకి ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచన
నిజామాబాద్, ఆంధ్రప్రభ: జిల్లాలోని చారిత్రక ఆలయాల పరిరక్షణకు బీజేపీ ఆధ్యాత్మిక సెల్ కృషి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించారు. గురువారం నిర్వహించిన బీజేపీ ఆధ్యాత్మిక సెల్ నూతన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నో చారిత్రక ఆలయాలు ఉన్నాయని, వాటి అభివృద్ధితో పాటు ఆలయ భూములను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆలయాలపై దాడులు, హిందూ వ్యతిరేక కార్యకలాపాలను ఎదుర్కొని అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
హిందువులందరినీ కలుపుకొని సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించేలా కృషి చేయాలని ధన్‌పాల్ సూర్యనారాయణ కోరారు. ఆలయ భూముల కబ్జాలు, ఆక్రమణలను అడ్డుకోవాలని సూచించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ ఆధ్యాత్మిక సెల్ రాష్ట్ర కన్వీనర్ సూర్య ప్రకాష్ రావు, కో-కన్వీనర్ నిరంజన్ దేశాయ్, జాయింట్ కన్వీనర్ నవీన్, జిల్లా కన్వీనర్ మేఘా సుబేదార్, రాష్ట్ర సలహాదారు ఉదయ్ మహారాజు, జిల్లా కో-కన్వీనర్ రాజేష్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.
