ఖేలో ఇండియా కబడ్డీ శిక్షణ శిబిరానికి నిజామాబాద్ క్రీడాకారిణులు
- సిరివెన్నెల, గౌతమిలకు అవకాశం
- జిల్లా కబడ్డీ అసోసియేషన్ హర్షం
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ: ఖేలో ఇండియా కబడ్డీ టోర్నమెంట్‌కు సన్నద్ధం చేసేందుకు నిర్వహించనున్న శిక్షణ శిబిరానికి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు ఎంపికయ్యారు. జిల్లాకు చెందిన సిరివెన్నెల, గౌతమిలు ఈ అవకాశం దక్కించుకున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి వీరు ఎంపికైనట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు అంద్యాల లింగయ్య, ప్రధాన కార్యదర్శి కె. గంగాధర్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.
ప్రస్తుతం సిరివెన్నెల, గౌతమి ఇందల్వాయిలోని టీజీటీడబ్ల్యూఆర్జేసీ బాలికల కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. చదువుతోపాటు కబడ్డీలోనూ ప్రతిభ కనబరుస్తూ ప్రతిష్ఠాత్మకమైన ఖేలో ఇండియా శిక్షణ శిబిరానికి ఎంపిక కావడం విశేషం. డిసెంబర్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఖేలో ఇండియా టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఈ శిబిరంలో క్రీడాకారిణులకు శిక్షణ ఇవ్వనున్నారు.
జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారిణులు ఎంపిక కావడం పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిరివెన్నెల, గౌతమిలను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
