ఎన్‌హెచ్‌ఎం సమ్మెతో చిన్నారులకు టీకాల కష్టాలు!

24 రోజులుగా నిలిచిన వ్యాక్సినేషన్‌.. గర్భిణులకు వైద్య సేవల్లోనూ అంతరాయం
కుబీర్‌, ఆంధ్రప్రభ :
జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల సమ్మెతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు ఆటంకం ఏర్పడుతోంది. డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు దాదాపు 24 రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో నిర్మల్‌ జిల్లా కుబీర్‌ మండలంలో చిన్నారులకు టీకాలు అందడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కుబీర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో తొమ్మిది సబ్‌ సెంటర్లు ఉన్నాయి. సాధారణంగా ప్రతి బుధవారం ఆయా కేంద్రాల్లో చిన్నారులకు పోలియో, రోటా వైరస్‌, పెంటావాలెంట్‌, ఐపీవీ, పీసీవీ తదితర టీకాలు వేస్తారు. గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందిస్తారు. ఏఎన్‌ఎంలు సమ్మెలో ఉండటంతో ఈ సేవలకు అంతరాయం కలుగుతోంది. బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మందుల పంపిణీ కూడా సక్రమంగా జరగడం లేదని స్థానికులు చెబుతున్నారు.
ప్రభుత్వాలు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం వివిధ దశల్లో టీకాలు అందిస్తున్నాయి. నిర్ణీత సమయానికి టీకాలు వేయించుకోలేకపోతుండటంతో పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గర్భిణులకు వైద్య పరీక్షలు, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు, ఇతర ఔషధాల పంపిణీ కూడా మందగించిందని పేర్కొంటున్నారు.
టీకాల కోసం ఎదురుచూపులు
కుబీర్‌ మండలం పల్సి తండాకు చెందిన జ్యోతి రెండు నెలల క్రితం ప్రసవించారు. ఆసుపత్రిలోనే తన బిడ్డకు తొలి టీకా వేయించారు. ఆ తర్వాత వేయించాల్సిన ఓపీవీ, ఐపీవీ తదితర టీకాలు ఇప్పటివరకు అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె కారణంగా టీకాల కార్యక్రమం నిలిచిపోవడంతో తమ పిల్లలకు సకాలంలో వ్యాక్సిన్లు అందడం లేదని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆరోగ్య సేవలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.