పశువైద్యశాల భవనానికి నిధులు మంజూరు చేయాలి
రాష్ట్ర పశుసంవర్ధక కార్యదర్శి గోపికి సర్పంచ్ అంజయ్య వినతి
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో నూతన పశువైద్యశాల భవనాన్ని మంజూరు చేసి, నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి గోపిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
గ్రామంలో ఉన్న పశువైద్యశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రస్తుతం కూరగాయల మార్కెట్‌లో పశువులకు వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితిని కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. సొంత భవనం లేకపోవడంతో పశువులకు వైద్యం అందించడంలో సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.
పశువులకు సంబంధించిన మందులు, వైద్య సామగ్రిని భద్రపరిచేందుకు సరైన వసతులు లేకపోవడంతో పశువైద్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బిజ్వార్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు, పశుపోషకులు పశువుల వైద్యం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
పశుసంపదపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, పశుపోషకుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని నూతన పశువైద్యశాల భవనాన్ని మంజూరు చేయడంతో పాటు నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని సర్పంచ్ అంజయ్య కోరారు. సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.
