New railway line | చకచకా పనులు..!
- నడికుడి-శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణం
- మెరుగు పడనున్న రవాణా సౌకర్యం
- జనవరి నుంచి రైళ్ల రాక-పోకలు
New railway line | పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. ముఖ్యంగా నడికుడి-శ్రీకాళహస్తి(Nadikudi-Srikalahasti) కొత్త రైల్వే లైన్ పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల మీదుగా ఏర్పాటవుతోంది. భూసేకరణ, పరిహారం సమస్యలు తొలగిపోయిన తర్వాత పనులు మరింత వేగవంతమయ్యాయి. ఈ రైలు మార్గం పూర్తయితే రవాణా అవకాశాలు మెరుగుపడటమే కాకుండా, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి(Regional economic development)కి కూడా దోహదం కానుందని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శి, పొదిలి ప్రాంతాల్లో ట్రాక్ పనులు ముందుగానే పూర్తయ్యాయి. ఆపై కనిగిరి నియోజకవర్గంలో పనులు వేగంగా కొనసాగి సమాప్తి దశకు చేరాయని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. తాజాగా కనిగిరి మండల పరిధిలోని గార్లపేట రోడ్ సమీపంలో మూడవ కొత్త రైల్వే స్టేషన్(new railway station) సిద్ధమైంది. ఈ మూడు స్టేషన్లు పూర్తవడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం పామూరు మండలం వరకు దాదాపు 50 కిలోమీటర్ల మేర ట్రాక్, వంతెనల నిర్మాణం వేగంగా సాగుతోందని, జనవరి నాటికి ఈ ప్రాంతంలో రైళ్లు నడిచే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

గతంలో పరిహారం చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా రైల్వే లైన్ నిర్మాణం నిలిచిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం బాధితులకు రూ.7 కోట్ల పరిహారం చెల్లించడంతో బ్రిడ్జిల పనులు(Bridge works) పూర్తయ్యాయి. ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకోవడంతో ప్రాజెక్ట్ మళ్లీ గాడిలో పడింది. ఈ రైల్వే లైన్ ప్రారంభమైతే అన్నమయ్య జిల్లా, నెల్లూరు, తిరుపతి ప్రాంతాలకు త్వరగా ప్రయాణించే అవకాశాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. స్టేషన్లు, క్వార్టర్లు, ప్లాట్‌ఫారాలు సిద్ధంగా ఉండటంతో రైల్వే విభాగం ట్రయల్ రన్స్(Trial runs) నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ లైన్ ప్రజలకు మాత్రమే కాకుండా వ్యాపారాలకు కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చనుందని స్థానికులు భావిస్తున్నారు. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తికి చేరుకోవడం పలు జిల్లాల ప్రజలకు ఆశాజనక అభివృద్ధి(Promising development) సంకేతం. రవాణా సౌకర్యం పెరగడమే కాకుండా, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా ఈ రైల్వే లైన్ ముఖ్యంగా దోహదం చేస్తుంది. జనవరి నుంచి రైళ్లు నడుస్తాయన్న ఆశలు స్థానిక ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.


