జేఎన్‌టీయూకేలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం.. 1,600 మంది విద్యార్థులకు వసతి
నరసరావుపేట, ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లాలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం పర్యటించారు. నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్‌టీయూకే) యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను ప్రారంభించారు.
గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నిర్మించిన ఈ వసతి గృహాల ప్రారంభోత్సవంలో మంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కళాశాల ప్రాంగణానికి చేరుకున్న నారా లోకేష్‌కు యాజమాన్యం, విద్యార్థులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
రూ.70 కోట్లతో 1,600 మందికి వసతి
సుమారు రూ.70 కోట్ల వ్యయంతో విద్యార్థినీ, విద్యార్థుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో నూతన హాస్టల్ భవనాలను నిర్మించారు. వీటిలో మొత్తం 1,600 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా ఏర్పాట్లు చేశారు. రిబ్బన్ కట్ చేసి భవనాలను ప్రారంభించిన అనంతరం మంత్రి లోకేష్ హాస్టల్ ప్రాంగణాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న వివిధ వసతులను స్వయంగా పరిశీలించారు.
విద్యార్థులకు మెరుగైన వసతి సదుపాయాలు అందుబాటులోకి రావడంతో కళాశాల ప్రాంగణంలో సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ వి. సంజనా సింహా, జేఎన్‌టీయూకే వైస్ ఛాన్సలర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


