అత్యవసర సేవల్లో అలసత్వం వద్దు..

అచ్చంపేట ఆసుపత్రికి కొత్త వైద్యులు.. ఎమ్మెల్యే వంశీకృష్ణ సమీక్ష

అచ్చంపేట, ఆంధ్రప్రభ: అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరతను తీర్చేందుకు కొత్తగా కేటాయించిన వైద్యులతో పాటు సీనియర్ వైద్యులతో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత లేకుండా అవసరమైన మేరకు వైద్యులను కేటాయించేలా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని సూచించారు. కేటాయించిన విధుల్లో వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు సేవలందించాలని ఆదేశించారు.

సమయపాలన విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారిపైనైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీకి వచ్చే రోగులతో పాటు అత్యవసర కేసులను వెంటనే గుర్తించి, ఎలాంటి జాప్యం లేకుండా మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రిలో వైద్యుల కొరతను తీర్చాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరిన వెంటనే నూతన వైద్యులను కేటాయించడం జరిగిందని వంశీకృష్ణ తెలిపారు. అచ్చంపేట ఏరియా ఆసుపత్రిపై ప్రజల్లో మరింత నమ్మకం కలిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోరారు.